
రూ. 25 లక్షలిచ్చి హత్య చేయించా
వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి హత్య కేసులో అరెస్టయిన ముఖ్య నిందితుడు జగన్నాథన్ బుధవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు.
నిందితుడి సంచలన వాంగ్మూలం
చెన్నై: వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి హత్య కేసులో అరెస్టయిన ముఖ్య నిందితుడు జగన్నాథన్ బుధవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తిరుమావళవన్ ప్రత్యేక కార్యదర్శి వెట్రిసెల్వన్ మే 20వ తేదీన మూవరసంపట్టు అనే ప్రాంతంలో స్థలం తగాదా గురించి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీని గురించి మడిపాక్కం డెప్యూటీ కమిషనర్ లక్ష్మినారాయణన్, ఇన్‌స్పెక్టర్ ధనరాజ్ కేసు నమోదు చేసి 28వ తేదీన కిరాయి ముఠాకు చెందిన పెరుమాళ్, వినోద్, మోహన్, సతీష్, ప్రభులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ముఖ్య నిందితుడైన జగన్నాథన్ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తూ వచ్చింది. అయితే జగన్నాథన్ తన లాయర్ ద్వారా మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు.
హత్య పూర్వపరాల గురించి జగన్నాథన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కానాత్తూరులోగల రూ.10 కోట్ల విలువైన భూమికి సంబంధించి తనకు వెట్రిసెల్వన్‌కు తగాదా ఏర్పడిందని, ఆ సమయంలో తనను హత్య చేస్తానని వెట్రిసెల్వన్ బెదిరించాడు... దీంతో భయపడిన తాను ముందుగానే అతన్ని హతమార్చేందుకు పథకం రూపొందించానన్నారు. ఆ క్రమంలో అతడిని హత్య చేసేందుకు రూ. 25 లక్షలతో కిరాయి ముఠాతో బేరం కుదుర్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆ ముఠా వెట్రిసెల్వన్‌ను హతమార్చిందన్నారు.