విక్రోలీలోని ఎస్‌ఆర్‌ఏ భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
సాక్షి, ముంబై: విక్రోలీలోని ఎస్‌ఆర్‌ఏ భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ఘటనలో మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పార్క్‌సైట్ సిద్ధార్థ్‌నగర్ కైలాస్ కాంప్లెక్స్‌లోని ఎస్‌ఆర్‌ఏ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మృతులను గౌతం శిగవణ్ (55), పూర్ణిమా శివగణ్ (50), విశాల్ శివగణ్ (25), ఆయుష్ శార్దుల్‌గా (05) గుర్తించారు. రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి ఈ భవనంలో నిద్రించిన శివగణ్ కుటుంబీకులను మంటలు చుట్టుముట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రాథమికంగా అందిన వివరాల మేరకు ఎలక్ట్రిక్ మీటర్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే వైర్లన్నింటికీ మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. ఆ భవనంలో అప్పటికే గాఢనిద్రలో ఉన్న వాళ్లు ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. కొందరు మేల్కోని ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకి పరుగులు తీశారు. అయితే ఐదు, ఆరో అంతస్తులో నివసించేవారికి మాత్రం కిందికి దిగేందుకు ఆలస్యమయింది. దీంతో శిగవణే కుటుంబీకులు నలుగురు అక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిని వికాస్ శిగవణే (26), గుణాజీ యాదవ్ (67), సిద్దేశ్ పాట్కర్ (23), బాలకృష్ణ అంబోలి (45), రాహుల్ ఇంగలే (31), వనితా ఆంబోలిగా గుర్తించారు. మిగతా ముగ్గురి పేర్లు తెలియరాలేదు. వీరందరిని సైన్ ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.