
భార్య వివాహేతర సంబంధాన్ని తల్లి దాచిందని..
భార్య వివాహేతర సంబంధ విషయం తనకు చెప్పకుండా దాచిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు.
వేలూరు: భార్య వివాహేతర సంబంధ విషయం తనకు చెప్పకుండా దాచిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం భార్యను కూడా చంపడానికి వెళ్తున్న అతన్ని గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అరెస్టు చేశా రు. ఈ ఘటన ఆర్కాడు తాలూకాలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఆర్కాడు తాలుకా తిమిరి సమీపంలోని తామరపాక్కం గ్రామానికి చెందిన పూంగావనం(53) కుమారుడు రమేష్. ఇతను కూలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే రమేష్ భార్య ప్రియ, అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజుల క్రితం ప్రియ తిరువణ్ణామలై జిల్లా ఆరణిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రియను వెళ్లి తీసుకురావాలని రమేష్ తల్లి పూంగావనంను కోరాడు.
వివాహేతర సంబంధం ఉన్న విషయం తనకు ముందే తెలుసని అయితే ఎక్కడ గొడవలు చోటుచేసుకుంటాయో అని చెప్పలేదని పూంగావనం జవాబిచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్ భార్య వివాహేతర సంబంధం విషయం ఎందుకు దాచావంటూ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం భార్యను కూడా చంపడానికి బయలుదేరాడు. అయితే గ్రామస్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు రమేష్‌ను మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.