హిజ్రాల పెళ్లిసందడి

Miss Koovagam highlights celebrations In Tamilnadu - Sakshi

కూవాగంలో ఘనంగా ఉత్సవాలు

మిస్‌ కూవాగంగా మోబీనా

నేడు రథోత్సవం

అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టు కూవాగంలోహిజ్రాలుముస్తాబయ్యారు. సంప్రదాయవస్త్రాలతో నవ వధువులుగా మారారు.  కూత్తాండవర్‌ఆలయంలో తాళి కట్టించుకుని ఆనందపారవశ్యంలో మునిగారు

సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్‌ ఆలయంలో  ఏటా చిత్తిరై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి ఉత్సవాలు హిజ్రాలకు ఓ పండుగే. దేశ విదేశాల్లోని హిజ్రాలకు ఓ వసంతోత్సవమే.  మహాభారత యుద్ధగాథతో ఇక్కడి ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని హిజ్రాలు తమ ఆరాధ్యుడిగా కొలుస్తూ ఈ ఉత్సవాల సంబరాల్లో మునిగి తేలుతారు. ఆ దిశగా కూవాగంలో కొలువై ఉన్న కూత్తాండవర్‌ తమ ఆరాధ్య ఐరావంతుడిగా భావించి తరిస్తారు.  ఇక్కడి ఉత్సవాలు గత నెల ప్రారంభమయ్యాయి.  ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తు్తన్నారు. మహాభారత గాథను ప్రజలకువివరిస్తూ ఇక్కడ నాటక ప్రదర్శన సాగింది.

పెళ్లి సందడి: ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం సాయంత్రం జరిగింది. అత్యంత వేడుకగా జరిగే ఈ మహోత్సవానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు సోమవారమే ఇక్కడికి తరలి వచ్చారు. ఎటుచూసినా, ఎక్కడ చూసినా హిజ్రాలతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. అందగత్తెలకు తామేమి తక్కువ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని కూవాగంకు ప్రత్యేక వన్నెను హిజ్రాలు తీసుకొచ్చారని చెప్పవచ్చు.  వీరిని చూడడానికి ఆ పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున వెలిసిన దుకాణాల్లో పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్లను ఉదయం నుంచి కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి,  విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం తరలి రావడం విశేషం. సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాబైన హిజ్రాలు  కూత్తాండవర్‌ ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి చేతుల మీదుగా తాళిబొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. ఈ వేడుకతో కూవాగంలో పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. ఇక, రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగారంతో íßహిజ్రాలు సందడి చేశారు. ఆట, పాటలతో ఆనందం తాండవంతో ఐరావంతుడ్ని తమ భర్తగా స్వీకరించి స్వామి  సేవలో  తరించారు.

మిస్‌ కూవాగంగా మోబీనా: పెళ్లి సందడికి ముందుగా, వయ్యారాల ఒలక బోస్తు హిజ్రాలు తమసత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. అందగత్తెలకు, మోడల్స్‌కు తామేమి తీసిపోమన్నట్టుగా ర్యాంప్‌పై అలరించారు. వయ్యారాలే కాదు, తమలోని ప్రతిభను చాటుకున్నారు. దక్షిణ భారత హిజ్రాల సంఘం, తమిళనాడు ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు, విల్లుపురం హిజ్రాల సంఘం తదితర సంఘాల సంయుక్తంగా మిస్‌ కూవాగం పోటీలను నిర్వహించాయి. 72 మంది హిజ్రాలు పోటీ పడగా, వివిధ కేటగిరిల వారీగా ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు. ఇందులో చెన్నై అరుంబాక్కంకు చెందిన మోబీనా మిస్‌ కూవాగం కిరిటాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానాన్ని చెన్నై పోరూర్‌కు చెందిన ప్రీతి, మూడో స్థానాన్ని ఈరోడ్‌కు చెందిన శుభశ్రీ దక్కించుకున్నారు. కార్యక్రమానికి  సినీ నటి కస్తూరి, నటుడు విమల్, రచయిత స్నేహన్, విల్లుపురం జిల్లా ఎస్పీ జయకుమార్, ఏఎస్పీ శంకర్‌ హాజరయ్యారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top