‘విలీన’ ఆందోళన..! | merging departments in new districts | Sakshi
Sakshi News home page

‘విలీన’ ఆందోళన..!

Sep 22 2016 11:59 AM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల్లో పలు ప్రభుత్వ శాఖల విలీనంపై ఇంకా సందిగ్ధం నెలకొంది.

  కొత్త జిల్లాల్లో 20 శాఖల విలీనం!
  ప్రభుత్వ ప్రకటన వెలువడి రెండు వారాలు
  ఇప్పటికీ రాని స్పష్టత.. సమీపిస్తున్న గడువు
  ఇదే జరిగితే ఉనికి కోల్పోనున్న పలు విభాగాలు
  శాఖాపర ప్రగతి, లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం?
  ఈ నిర్ణయంపై పలువురు ఉద్యోగుల్లో అసంతృప్తి
 
సాక్షి, మంచిర్యాల : కొత్త జిల్లాల్లో పలు ప్రభుత్వ శాఖల విలీనంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. జిల్లాల ఆవిర్భావానికి ఇంకా 19 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అప్పటిలోగా శాఖల విలీనం.. ఉద్యోగులు విభజన,  ఫైళ్ల సర్దుబాటు అనుమానమే అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అసలు శాఖల విలీనం ఉంటుందో..? లేదో..? అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరో పక్క.. కార్యాలయాల ఏర్పాటుకు త్వరలోనే భవనాలు ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించడంతో తమ శాఖలు విలీనమవుతాయనుకుంటోన్న అధికారులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.
 
ఇప్పటికీ పలు శాఖాధికారులు కార్యాలయాల భవనాల ఎంపికపై ఆసక్తి చూపడం లేదు. శాఖల విలీనంతో.. కొత్త జిల్లాల్లో పాలన మరింత కుంటుపడుతుందని ఆశించిన ప్రగతిని సాధించలేమని విలీన శాఖల ఉద్యోగులు వాపోతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్న కొత్త జిల్లాల్లో కొరతగా ఉన్న అధికారులు.. ఉద్యోగుల సమస్యకు పరిష్కారంగా ఒకే పనితీరున్న శాఖలన్నీ ఒకే గొడుగు కింద తేవాలని రెండు వారాల క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాల్లో పాలనాపర ఇబ్బందులు తలెత్తకుండా 20 శాఖలను విలీనం చేయాలని ప్రభుత్వం చేపట్టిన కసరత్తు దాదాపు పూర్తయిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం తుది మెరుగులూ దిద్దింది.
 
శాఖల ప్రగతిపై ప్రతికూల ప్రభావం
శాఖల విలీన ప్రక్రియ పలు ప్రభుత్వ శాఖల ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ప్రభుత్వ విధివిధానాలతో.. దాదాపు ఇరవై విభాగాలు ఉనికి కోల్పోయే ప్రమాదముంది. ఆయా విభాగాలను అదే పనితీరున్న శాఖల్లో విలీనం చేయడంతో శాఖాపర ప్రగతి.. సంక్షేమ పథకాల లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పలు శాఖల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న తమ శాఖల్ని విలీనం చేస్తే.. తమ శాఖాపర సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయో లేవోననే ఆందోళన విలీన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. పాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోన్న ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని పలు శాఖల అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 9న.. వ్యవసాయ శాఖలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను విలీనం చేయొద్దంటూ బాధిత శాఖ ఉద్యోగులు ఆ శాఖల కార్యదర్శి పార్థసారథికి వినతిపత్రం అందజేశారు.
 
అధికారులకు సవాలే..!
కొత్త జిల్లాల ఏర్పాటుతో విలీనమయ్యే అదనపు శాఖల పర్యవేక్షణ విషయంలో ఇప్పుడే అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పట్టు, ఉద్యానవన, వ్యవసాయ శాఖల్ని కలిపి.. వ్యవసాయ అధికారి పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ కమిషనర్లకు అదనంగా మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్ బాధ్యతలు అప్పగించనుంది. జిల్లాలో వేర్వేరుగా ఉన్న సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, పాఠ శాల విద్యాశాఖలను జిల్లా విద్యాశాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.
 
అలాగే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, జిల్లా సంక్షేమ అధికారి పర్యవేక్షణ లో పని చేసేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇలా.. మరిన్ని విభాగాలను ఒక్కో శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాఖలు.. ఉద్యోగుల విలీన అంశాన్ని అటుంచితే.. అదనంగా చేరిన శాఖలపై పర్యవేక్షణ తమకు తలనొప్పి వ్యవహారమేనని మంచిర్యాలకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే వేర్వేరుగా ఉన్న సంక్షేమ పథకాల ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని చెప్పిన ఆయన సంక్షేమ శాఖలు విలీనం చేస్తే.. భవిష్యత్తులో ఆయా విభాగాల పని తీరు.. ప్రగతి కుంటుబడుతోందని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement