కుటుంబ సభ్యులతో ఏవిధంగా సన్నిహితంగా ఉంటామో అదేవిధంగా జాతీయ రాజధానిని సైతం స్నేహానికి వారధిని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులతో ఏవిధంగా సన్నిహితంగా ఉంటామో అదేవిధంగా జాతీయ రాజధానిని సైతం స్నేహానికి వారధిని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్థానికులకు హితవు పలికారు. స్థానిక ఛత్రసాల్ స్టేడియంలో ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన గణతంత్ర వేడుకల పరేడ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వచ్చే నెల ఏడో తేదీన నగరవాసులంతా తమ తమ ఆవాసాలను వీడి పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చి ఓటు వేయాలి. మనమంతా కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాం. అందువల్ల ఎంతో ఉత్సాహంతో అంతా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి. ఇది అందరి బాధ్యత’ అని విన్నవించారు.
గూడులేనివారికి ఆవాసాలు
నగరంలోని గూడులేని వారికి ఆవాస వసతి కల్పనకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని జంగ్ పేర్కొన్నారు. నిరాశ్రయులకు నైట్ షెల్టర్లను నిర్మించ డం కూడా అందులో భాగమేనన్నారు. ‘దేశం ఎంతో పురోగమిస్తోంది. అయితే ప్రతిరోజూ కొత్త కొత్త సవా ళ్లు ఎదురవుతున్నాయి. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అని అన్నారు. ప్రపంచ రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయని, కొత్త కొత్త సవాళ్లను అధిగమించాల్సి ఉందని అన్నారు. దీంతోపాటు మనం కూడా శరవేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.
20 శాతం పచ్చదనం
నగరాన్ని సతతహరితంగా ఉంచాల్సిన అవసరం ఉందని జంగ్ పేర్కొన్నారు. నగరంలోని 20 శాతం ప్రాంతంలో పచ్చదనం పరిఢవిల్లుతోందన్నారు. నగరంలో దాదాపు 20 వేల పార్కులు ఉన్నాయని, ఇందువల్ల కొంతమేర కాలుష్య నియంత్రణ జరుగుతుందన్నారు. కాగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని సాయుధ , పారామిలిటరీ, పోలీసు బలగాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.