జగన్నాథునికి నిద్రాహారాలు కరువు 

Lord Jagannath Swami Sevas Has Been Stopped - Sakshi

సేవాయత్‌ల మొండివైఖరే కారణం

పాలక వర్గం నిస్సహాయత 

మట్టి పాలైన అన్నప్రసాదాలు

భువనేశ్వర్‌ : విశ్వవిఖ్యాత జగన్నాథునికి కూడా కష్టాలు తప్పడం లేదు.  ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో న్యాయ, అధికారిక సంస్కరణలు జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో తీవ్ర అలజడిని రేకెత్తించాయి. శ్రీ మందిరం రత్న వేదికపై జగన్నాథునితో కొలువు దీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, సుదర్శనుడు గత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉపవాసంతో జాగారం చేయాల్సి వచ్చింది. వరుసగా సోమ, మంగళవారాల్లో ఇదే పరిస్థితి తారసపడింది.

జగతి నాథునికి కష్టాలు తెచ్చిపెడుతున్న శ్రీ మందిరం దేవస్థానం సేవాయత్‌లు, అధికార వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.  భగవంతుడు ఒక వైపు ఉపవాసం, జాగారాలతో నిరీక్షిస్తుండగా శ్రీ మందిరం ఆలయ వైకుంఠం (కొయిలి వైకుంఠొ) ప్రాంగణంలో అమూల్యమైన  జగన్నాథుని అన్న ప్రసాదాల్ని పాతిబెట్టారు. దీంతో ఈ ప్రసాదాల కోసం పరితపించే భక్త జనానికి తీవ్ర మనస్తాపం ఎదురైంది. 

జగమోహన మండపం వివాదమే కారణమా!
దాదాపు 2 ఏళ్లుగా మూతబడిన శ్రీ మందిరం ప్రాంగణంలోని జగ మోహన మండపాన్ని ఈ నెల 16వ తేదీన పునఃప్రారంభించారు. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. దైనందిన సేవలకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని గర్భగుడిలోకి అనుమతించ రాదని హై కోర్టు ఆంక్షలు విధించింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ఈ ఉత్తర్వులు కళంకమంటూ సేవాయత్‌ వర్గం ఆక్షేపించింది. గర్భగుడిలోకి ప్రవేశించడంపట్ల ఆంక్షలు నివారించాలని పట్టుబట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన కొరవడింది. దీంతో సేవాయత్‌ వర్గం ఎదురు దాడికి పరోక్షంగా సిద్ధమైంది.

గర్భగుడి రత్నవేదికపై సేవల్ని నిర్వహించాల్సిన సింఘారి సేవాయత్‌ వర్గీయులకు అనివార్య కారణాలతో గర్భగుడిలోకి అడుగిడే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా సేవల్ని   నిర్వహించేందుకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని రాష్ట్ర హై కోర్టు నివారించినందున అనుబంధ సేవల్ని నిర్వహించేందుకు ఇతర వర్గాల సేవాయత్‌లు కూడా నిరాకరించారు. ఇలా సోమవారం శ్రీ మందిరంలో జగమోహన మండపం పునఃప్రారంభాన్ని  పురస్కరించుకుని వివాదం తలెత్తడంతో నిత్యసేవలకు గండి పడింది. 

ప్రభావితమైన నిత్యసేవలు
సోమవారం మంగళహారతి నుంచి ఇతర సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రాతఃకాల ధూపాదుల కార్యక్రమాన్ని సోమ వారం మధ్యాహ్నం ఆలస్యంగా నిర్వహించారు. ఈ క్రమంలో అపరాహ్న సేవలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. నిత్య కార్యకలాపాల్లో భాగంగా స్వామి వారి నివేదన కోసం వండిన అన్న ప్రసాదాలు పోటు ప్రాంగణంలోనే మగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో  గర్భగుడి రత్నవేదికపై జగన్నాథునికి భోజనం లేకుండా పోయింది. నిత్య సేవల్లో క్రమం తప్పడంతో సోమవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ కూడా జరగలేదు. దీంతో స్వామి సోమవారం రాత్రి జాగారం చేయాల్సి వచ్చింది. 

భక్తులకూ దక్కని స్వామి ప్రసాదం
మొత్తంమీద స్వామి వారికి అన్న ప్రసాదాల నివేదన జరగనందున నివేదనకు నోచుకోని  అన్న ప్రసాదాల్ని శ్రీ మందిరం సముదాయంలో ఉన్న కోవెల వైకుంఠం (మూల విరాట్ల స్మశాన వాటిక)లో మట్టిలో పాతి బెట్టి చేతులు దులిపేసుకున్నారు. నిత్యం 56 రకాల వంటకాలతో అన్న ప్రసాదాల్ని సేవించాల్సిన స్వామికి వరుసగా రెండు రోజులపాటు వీటి నివేదన జరగకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ జగన్నాథుని భక్తులు తీవ్ర మనస్తాపం చెందారు. స్వామి ఉపవాసం పాలు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే అశేష సంఖ్య భక్తులు, యాత్రికులకు జగన్నాథుని మహా ప్రసాదం లభ్యం కాలేదు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top