రాజకీయలబ్ధి కోసం పాకులాట

రాజకీయలబ్ధి కోసం పాకులాట - Sakshi


టీనగర్ : రాజీవ్ హంతకులు ఏడుగురి విడుదల వ్యవహారంలో జయలలిత రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నారని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయస్ అనే ఏడుగురికి విచారణ కోర్టు మరణ శిక్షను విధించిందని, తర్వాత నళిని, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చిందని పేర్కొన్నారు. 


ఈ ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో మరణ శిక్ష పొందిన మరుగన్, శాంతన్, పేరరివాళన్ శిక్షను కూడా యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం మాట్లాడుతూ నేరస్థుల మరణశిక్షను యావజ్జీవ శిక్షకు మాత్రమే తగ్గించినట్లు పేర్కొన్నట్లు తెలిపారు. వారి విడుదల గురించి తామేమీ వ్యాఖ్యానించలేదన్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సరైన న్యాయ నిబంధనలు అనుసరించవచ్చని తీర్పులో విశదీకరించినట్లు తెలిపారు. దీని ప్రకారం నేరస్థులు పిటిషన్ అందజేయాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోర్టులో నివేదిక దాఖలు చేయాలని తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారం గురించి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అంతరార్థం ఏమైనప్పటికీ, కేసు విచారణ చాలా ఆలస్యమైన ప్రస్తుత తరుణంలో వీరి విడుదల చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందనే విశ్వాసాన్ని తెలిపారని పేర్కొన్నారు. నేరస్థులను విడుదల చేసే అధికారం ఎవరికి ఉందనే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానం కాలయాపన చేయకుండా సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడుగురు నేరస్థులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లేదా 161 సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంకే తరఫున కోరుతున్నట్లు తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top