చీకట్లో రోషిణి

Karnataka Government Delayed Roshni Scheme - Sakshi

 అమలుకు నోచని ఆధునిక విద్యా పథకం  

బీబీఎంపీ విద్యార్థులకు అందని భాగ్యం  

పాఠశాలల్లో కనీస వసతులు కరువు

పాలికె అలసత్వమే కారణం

ఒక ప్రపంచస్థాయి కార్పొరేట్‌ సంస్థ ఉచితంగా ఆధునిక విద్యా బోధనకు ముందుకొస్తే, సద్వినియోగం చేసుకోవాల్సిన పాలికె మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రతిష్టాత్మక పథకం అటకెక్కేలా ఉంది.  

కర్ణాటక, బనశంకరి:   బృహత్‌ బెంగళూరు మహానగర పాలికెకు చెందిన పాఠశాలల విద్యార్ధులకు సెట్‌లైట్‌ విద్య భాగ్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమౌతున్నప్పటికీ ఆధునిక శిక్షణ అందించే రోషిణి పథకం అమలుకు పాఠశాలలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.500 కోట్ల వ్యయంతో బీబీఎంపీ పరిధిలోని 156 పాఠశాలలు, కాలేజీల్లో సెట్‌లైట్‌ శిక్షణా విధానాన్ని అమలు చేయడానికి కొద్దినెలలకిందట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై ఇప్పటికే ఫ్రేజర్‌టౌన్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో బోధనకు అవసరమైన పరికరాలను అమర్చారు. కానీ బోధన మాత్రం ప్రారంభం కాలేదు. మిగిలిన పాఠశాలల్లో ఇప్పటివరకు  ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆధునిక బోధన విద్యార్థులకు అందని మావిగానే మిగిలిపోతోంది. 

రోషిణి కింద బడుల్లో చేపట్టే అభివృద్ధి  కార్యక్రమాలు  
కంప్యూటర్‌ ల్యాబ్‌  
డిజిటల్‌ లైబ్రరీ
ల్యాబరేటరీ
క్రీడాపరికరాల సరఫరా
సృజనశీలత కేంద్రం
కౌశల్య అబివృద్ధి కేంద్రం,  
 సముదాయ భవనం
కొత్త గదులు, మరుగుదొడ్లు నిర్మాణం

వసతులు లేవు, భవనాలు ఘోరం రోషిణి పథకం అమలు గురించి మైక్రోసాప్ట్‌ సంస్థ  కొన్ని షరతులు విధించింది. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నది అందులో ముఖ్యమైనది. బడి భవనాల మరమ్మత్తులు, మరుగుదొడ్లు నిర్మిఇంచాలి. కానీ ఇందుకు బీబీఎంపీ చర్యలు చేపట్టలేదు. దీంతో సెట్‌లైట్‌ విద్య అందించడానికి అవసరమైన ఎల్‌ఇడీటీవీ, ఇంటర్నెట్‌సౌలభ్యం తదితర వ్యవస్ధలు కల్పించలేదు.  

బీఎంపీ పరిధిలోని 156 పాఠశాల, కాలేజీల్లో రోషిణి పథకం అమలు కానుంది. కానీ 50 శాతం పాఠశాల, కాలేజీల భవనాలను మరమ్మత్తులు చేయాల్సి ఉంది. శిక్షణ స్థాయీ సమితి అంచనా ప్రకారం కట్టడాల మరమ్మత్తులకు  కనీసం రూ.100 కోట్లు అవసరం ఉందని తెలిపింది. కానీ బడ్జెట్‌లో అంత మొత్తంలో నిదులు కేటాయించకపోవడంతో కట్టడాల మరమ్మత్తుల కార్యక్రమాలను  
వాయిదావేశారు.  

శిక్షణ విభాగానికి ప్రత్యేక ఇంజనీరింగ్‌ సెల్‌  
బీబీఎంపీ పాఠశాల, కాలేజీ కట్టడాలను పరిశీలించి వాటిని మరమ్మత్తులు, ఆధునీకరణకు ప్రత్యేక ఇంజనీరింగ్‌ సెల్‌ ప్రారంభించాలని శిక్షణ స్థాయీ సమితి గతంలో కమిషనర్‌కు ప్రతిపాదనలు అందజేసింది. ఇంజనీరింగ్‌ సెల్‌ ప్రారంభమైతే కట్టడాల నాణ్యత పరిశీలన, కట్టడాల మరమ్మత్తులు గురించి పథకం రూపొందించడం, టెండర్‌ప్రక్రియ నిర్వహించి త్వరలో పనులు చేపట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని స్థాయీసమితి అభిప్రాయపడింది. కానీ అది కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top