యువతుల వివాహానికి ప్రభుత్వ కానుకగా ఎనిమిది గ్రాముల బంగారు నాణాల పంపక పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ప్రారంభించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం యువతుల వివాహానికి ప్రభుత్వ కానుకగా ఎనిమిది గ్రాముల బంగారు నాణాల పంపక పథకాన్ని ప్రారంభించారు. తన నియోజకవర్గమైన డా.రాధాకృష్ణన్ నగర్ కు చెందిన అయిదుగురు యువతులకు ముఖ్యమంత్రి బంగారు నాణాలను అందించారు. ఈ ఏడాది మే 23 తర్వాత బంగారునాణెల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి(12,500 మంది) ఎనిమిది గ్రాముల నాణెలను, అంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి(1.4 లక్షల మంది) నాలుగు గ్రాముల బంగారు నాణెలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
పది అంతకంటే ఎక్కువ చదువుకున్న యువతులకు 2011నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వం రూ.25 వేలు, నాలుగు గ్రాముల కాయిన్ లను, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతులకు రూ.50వేల నగదు, 4 గ్రాముల నాణాలను అందిస్తూ వస్తోంది. ఈ ఏడాది మేలో తిరిగి అధికారం చేపట్టిన జయలలిత.. చదువుకున్న యువతుల పెళ్లిళ్లకు ఇస్తున్న బంగారు నాణాల బరువును ఎనిమిది గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.