హెల్మెట్‌ ప్లీజ్‌

Helmet Challans Rises In Karnataka - Sakshi

బెంగళూరులో ఆగని ఉల్లంఘనలు

లక్షలాది మందికి జరిమానాలు విధిస్తున్నా అంతే

సాక్షి బెంగళూరు: హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని ద్విచక్ర వాహనదారులకు పోలీసులు, ప్రభుత్వం, కోర్టు పలు విధాలుగా అవగాహన కల్పిస్తున్నా అరణ్య రోదనే అవుతోంది. శిరస్త్రాణాలు లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే వాహనం నడపాలని 2016లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా బెంగళూరులో ద్విచక్ర వాహనదారులు యథేచ్ఛగా హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నా మార్పు స్వల్పమే.

ఏటా లక్షలాది కేసులు
రాజధానిలో హెల్మెట్‌ లేని వాహనదారులకు రూ.100 చొప్పున జరిమానా విదిస్తున్నారు. గతేడాది జూన్‌ నుంచి ఈ జూన్‌ వరకు ఇలా 6.95 లక్షల మందిపై ఫైన్‌ వేసి కేసులు రాశారు.
ద్విచక్రవాహనాల్లో ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురైన వారి సంఖ్య 2017లో 73 ఉండగా.. అందులో హెల్మెల్‌ లేకుండా ప్రమాదాలకు గురై మరణించిన వారి సంఖ్య 66గా ఉంది.
2018లో ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య 44 ఉండగా, అందులో 40 మంది హెల్మెట్‌ ధరించలేదని తేలింది.

కఠిన చర్యలు తీసుకోవాలి
ట్రాఫిక్‌ నిబంధనలను పోలీసులు నిక్కచ్చిగా అమలు చేయాలి.  ప్రధాన కూడళ్లతో పాటు చిన్న చిన్న రోడ్లలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి జరిమానా వసూలు చేయాలి. పదేపదే హెల్మెట్‌ లేకుండా దొరుకుతున్న వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయాలి. రాజధాని నగరంలో సుమారు 40 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అందులో 60 శాతం పైగా వాహనదారులు హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారు.                     – ఎంఎన్‌ శ్రీహరి, సర్కారు మాజీ ట్రాఫిక్‌ సలహాదారు

ప్రజల్లో మార్పు రావాలి
ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేస్తూ ఉండటంతో ప్రయోజనం లేదు. ప్రజల్లో మార్పు వస్తే సరిపోతుంది. స్పెషల్‌ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు, బహిరంగ ప్రచారాలు చేస్తున్నాం. అయినా హెల్మెట్‌ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా శిరస్త్రాణం ధరించి ప్రయాణించాలని కోరుతున్నాం.
– ఆర్‌.హితేంద్ర, అదనపు పోలీసు కమిషనర్‌

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top