సమ్మె బాట! | Fishermen Strike | Sakshi
Sakshi News home page

సమ్మె బాట!

Mar 10 2014 3:34 AM | Updated on Sep 2 2017 4:31 AM

రామేశ్వరం, పంబన్, ధనుస్కోడి జాలర్లు నిరవధిక సమ్మె బాట పట్టారు. ఆదివారం నుంచి చేపల వేటకు దూరంగా ఉండేందుకు నిర్ణయించారు.

సాక్షి, చెన్నై: రామేశ్వరం, పంబన్, ధనుస్కోడి జాలర్లు నిరవధిక సమ్మె బాట పట్టారు. ఆదివారం నుంచి చేపల వేటకు దూరంగా ఉండేందుకు నిర్ణయించారు. దీంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యాయి. కచ్చదీవుల్లో చేపల వేట రామేశ్వరం తీర జాలర్లకు దిన దిన గండంగా మారింది. శ్రీలంక పైశాచికత్వానికి ఆ తీర జాలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబ పెద్దలను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిషేధిత వలలతో చేపల్ని వేటాడడం వల్లే పట్టకెళ్తున్నామని శ్రీలంక అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో నిషేధిత వలలను ఉపయోగించే రాష్ట్ర జాలర్లపై కొరడా ఝుళిపించే పనిలో అధికారులు ఉన్నారు. అయితే, శ్రీలంకలో నిషేధం ఉన్న వలలను ఇక్కడ ఉపయోగించకూడదని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని రాష్ట్ర జాలర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉపయోగించే వలలు వేరు, అక్కడ ఉపయోగించే వలలు వేరు అని సూచిస్తున్నారు. 
 
 శ్రీలంక నావికాదళానికి తోడుగా రాష్ట్ర అధికారులూ తమను వేధించడంతో రామేశ్వరం, పంబన్, ధనుస్కోడి, రామనాథపురం తీర జాలర్లు సమ్మె బాట పట్టారు. చేపల వేటను నిషేధించారు. 90 శాతానికి పైగా జాలర్లు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వలల ద్వారానే చేపలను వేటాడుతున్నారని, ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం మంచి పద్ధతి కాదని, అందుకే నిరవధిక సమ్మెకు దిగుతున్నామని ఆదివారం ప్రకటించారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడుదల చేయాలని, అధికారులు వేధింపులు మానుకోవాలన్న డిమాండ్‌తో జాలర్లు చేపల వేటకు దూరంగా ఉండటంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఈనెల 12న భారీ నిరసన కార్యక్రమానికి నిర్ణయించామని జాలర్ల సంఘాలు ప్రకటించాయి. తమ కుటుంబం కార్డులను, ఓటరు గుర్తింపు కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయనున్నామని, ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపారు. ఈనెల 13న కొలంబో వేదికగా జరిగే చర్చల ద్వారా తమకు అనుకూలంగా నిర్ణయాలు, ఒప్పందాలు లేని పక్షంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement