ఎత్తినహొళె పథకాన్ని రాజకీయం చేస్తుండడం తగదని, ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఈ పథకం అమలుచేసితీరతాన ని కేంద్రమంత్రి,స్థానిక ఎంపీ వీరప్పమొయిలీ స్పష్టం చేశారు.
- రాజ్‌నాథ్ సింగ్ నాకు సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదు
- కేంద్రమంత్రి వీరప్పమొయిలీ
దొడ్డబళ్లాపురం,న్యూస్‌లైన్: ఎత్తినహొళె పథకాన్ని రాజకీయం చేస్తుండడం తగదని, ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఈ పథకం అమలుచేసితీరతాన ని కేంద్రమంత్రి,స్థానిక ఎంపీ వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పాత బస్టాండులో నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అంతకుముందు ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి జరగగాలని, తాగునీరు అందించాలనే మంచి మనసు ఉన్నవారెవ్వరూ ఎత్తినహొళెను రాజకీయం చేయరన్నారు.
జల నిపుణులు పరమశివయ్య నివేదిక అమలు చేయడానికి పాతిక సంవత్సరాలు పడుతుందని, ఆలోపు బయలుసీమలోని 5 జిల్లాలు ఎడారవుతాయన్నారు. ఈలోపు ఎత్తినహొళె పథకం అమలుచేస్తే 5 జిల్లాలలోని ప్రతీ చెరువు నిండుతుందన్నారు. కొందరు స్వార్థపరులు నేత్రావతి నది మళ్లింపు అంటూ పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. నిజానికి సముద్రంలో కలిసే నదినీటిని మాత్రమే ఈ పథకంలో మళ్లిస్తున్నామన్నారు.
బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీష్‌శెట్టర్ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ పథకాన్ని అంగీకరించారని, బీజేపీ ప్రభుత్వం హయాంలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేయగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో రెండు వందల కోట్లు పెంచి రూ1200 కోట్లు విడుదల చేసారన్నారు. కర్ణాటక ర రాష్ట్రంలో ఉన్నంతమంది జలనిపుణులు వేరే ఏ రాష్ట్రంలోనూ లేరని, వారు పథకాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అంగీకరిస్తారన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదు :
ఇటీవల దొడ్డబళ్లాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడి భగత్‌సింగ్ క్రీడామైదానంలో జరిగిన భారత్ గెలిపించండి కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు మొయిలీని ఉద్దేశించి అపద్దాల కోరు..ఆయన చెప్పేవన్ని అపద్దాలే అని విమర్శలు గుప్పించడం పట్ల మొయిలీ తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ నాకు సర్టిఫికెట్ ఇచ్చేంత యోగ్యుడు కాదని అనుకుంటున్నానన్నారు. ఎంపీ అనంతకుమార్ మొయిలీని ఉద్దేశించి వలస పక్షిగా ఏద్దేవా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అనంతకుమారే వలస పక్షి అన్నారు.
బాబు జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణకు రాష్ట్ర మంత్రి హెచ్ ఆంజనేయ మరో అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగ్జీవన్‌రాం లాంటి మహా వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య, దేవనహళ్లి ఎమ్మెల్యే పిళ్లముని శామప్ప, మాజీ ఎమ్మెల్యే ఆర్‌జీ వెంకటాచలయ్య, నగరసభ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.