
ఉన్నత విద్యను ప్రోత్సహించండి
ఉన్నత విద్యారంగంలో దేశం ఇప్పటికీ వెనకబడే ఉందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు.
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ
బెంగళూరు : ఉన్నత విద్యారంగంలో దేశం ఇప్పటికీ వెనకబడే ఉందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను, ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నగరంలోని ఆర్.వి.ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ...అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత విద్యా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను సైతం అందజేస్తున్నారని తెలిపారు. పక్కనే ఉన్న చైనాతో పోలిస్తే ఉన్నత విద్యారంగంలో మనం వెనకబడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఉన్నత విద్యా రంగానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహకాలను అందజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మన దేశంలో ప్రతి ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వస్తున్న విద్యార్థుల్లో కేవలం 25శాతం మంది మాత్రమే ఉద్యోగాలను పొందుతున్నారని తెలిపారు.
ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...రాష్ట్రంలో విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కర్ణాటక ఉన్నత విద్యా రంగంలో ప్రధమ స్థానంలో ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.