విష్ణుప్రియ కేసులో సీబీఐ విచారణ | DSP Vishnupriya suicide: Jayalalithaa rejects demands for CBI probe | Sakshi
Sakshi News home page

విష్ణుప్రియ కేసులో సీబీఐ విచారణ

Oct 25 2016 8:37 AM | Updated on Sep 2 2018 5:45 PM

విష్ణుప్రియ కేసులో సీబీఐ విచారణ - Sakshi

విష్ణుప్రియ కేసులో సీబీఐ విచారణ

డీఎస్పీ విష్ణుప్రియ మృతి కేసు విచారణ సీబీఐకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.

సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వాదన తిరస్కృతి

చెన్నై: డీఎస్పీ విష్ణుప్రియ మృతి కేసు విచారణ సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారి మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే విష్ణుప్రియ మృతికి ఆధారాలు ఉన్నాయని ఆమె తండ్రి వాదిస్తుంటే, సీబీసీఐడీ విచారణకే మొగ్గు చూపడం ఏమిటో? అని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ దృష్ట్యా కేసు మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ వర్గాలు రంగంలోకి దిగడం ఖాయమైంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో గతేడాది కులాంతర ప్రేమ వ్యవహారంలో  ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఈ కేసును విచారిస్తున్న డీఎస్పీ విష్ణుప్రియ తీవ్ర ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అదే సమయంలో విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఉన్నతాధికారుల వేధింపులకు ఆమె బలైనట్టు, గోకుల్ రాజ్ హత్య కేసు విచారణను అడ్డుకునే రీతిలో సాగిన ప్రయత్నాలకు విష్ణుప్రియ బలైనట్టుగా సంకేతాలు ఏర్పడ్డాయి. దీంతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. రాష్ట్ర పోలీసులు విచారిస్తే, వాస్తవాలు బయటకు రావని, ఈ కారణాల దృష్ట్యా, సీబీఐకు అప్పగించాలని విష్ణుప్రియ తండ్రి రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విచారణకు డివిజన్ బెంచ్ స్పందించింది.

పూర్వాపరాలను విచారించడమే గాకుండా, త్వరితగతిన విచారణ ముగించి నివేదిక సమర్పించాలని, సీబీసీఐడీకి డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే, కోర్టు గడువును సీబీసీఐడీ వర్గాలు సద్వినియోగం చేసుకోలేదని చెప్పవచ్చు. దీంతో సీబీసీఐడీ ద్వారా ఒరిగేది శూన్యమేనని గ్రహించిన డివిజన్ బెంచ్ విష్ణుప్రియ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ గత నెల ఆదేశాలు వెలువరించింది.

అంతేగాకుండా, మూడు నెలల్లో దర్యాప్తు ముగించి కోర్టు ముందు నివేదిక ఉంచాలని సూచించారు. అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీసీఐడీ విచారణ ముగింపు దశలో ఉన్న సమయంలో, కొత్తగా సీబీఐ విచారణ అవసరం లేదన్న వాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.

సోమవారం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఉన్నతాధికారి మృతి కేసులో విచారణ తీరు ఇదేనా..? అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. ఇక, మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని పేర్కొంటూ, సీబీఐ విచారణకు మద్దతుగా నిలవడం విశేషం. ఈ తీర్పు మేరకు సీబీఐ విచారణ పగ్గాలు చేపట్టి, ఇచ్చిన గడువులోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని సూచిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించడమే గాకుండా, ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement