ఢిల్లీలో లోకాయుక్త నియామకం ఎంతవరకు వచ్చిందని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత సంవత్సరం జూన్‌లో న్యాయమూర్తి మన్మోహన్ సరీన్ పదవీకాలం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో లోకాయుక్త నియామకం ఎంతవరకు వచ్చిందని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత సంవత్సరం జూన్‌లో న్యాయమూర్తి మన్మోహన్ సరీన్ పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఢిల్లీలో లోకాయుక్త పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవిలో మరొకరి నియమించే పద్ధతి గురించి తెలియచేయాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది. లోకాయుక్త నియామకంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, న్యాయమూర్తి ఆర్.ఎస్. ఎండ్లాతో కూడిన ధర్మాసనం లోకాయుక్త నియామకంపై కేంద్రం నుంచి ఆదేశాలను తీసుకోవలసిందిగా అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్‌ను ఆదేశించింది. కొత్త లోకాయుక్తను నియమించాలని లేదా మాజీ లోకాయుక్త చైర్మన్ మన్మోహన్ సరీన్ పదవీకాలాన్ని పొడిగించాలని పిటిషనర్ కోరారు.
ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 17న చేపట్టనున్నట్లు ప్రకటించిన ధర్మాసనం లోకాయుక్త నియామకం కోసం పాటించే పద్ధతి ఏమిటని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని, ఈ తరవాత తామే అవసరమైన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.లోకాయుక్త నియామకాన్ని కోరుతూ కమ్రాన్ సిద్ధిఖీ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఓఖ్లా ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌పై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఖాన్ ప్రజా నిధులను తన నియోజకవర్గరంలో కనీస వసతులను కల్పించడంపై వెచ్చించకుండా శ్మశానవాటిన సుందరీకరణపై ఖర్చు చేస్తున్నారని సిద్ధికీ ఆరోపించారు.
పజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా ఖాన్‌ను అడ్డుకోవాలని ఆయన కోరారు. ఇటువంటి కేసులపై మాజీ లోకాయుక్త మన్మోహన్ సరీన్ దర్యాప్తులు ప్రారంభించారని, ఈ దర్యాప్తులు చివరి దశలో ఉండగా సరీన్ పదవీకాలం ముగిసిం దని సిద్దిఖీ తరపు న్యాయవాది కమ్రాన్ మాలిక్ చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తులు కొనసాగేందుకు సరీన్ పదవీకాలాన్ని పొడిగించాలని లేదా కొత్త లోకాయుక్తను నియమించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌పై 17 క్రిమినల్ కేసులున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది మాలిక్ కోర్టుకు చెప్పారు.
వాటిలో చాలా కేసులు ప్రభుత్వాధికారులపై దాడులు, డీడీఏకు చెందిన స్థలాల ఆక్రమణకు సంబంధించిన కేసులని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఎమ్మెల్యే లాడ్ నిధులను బాట్లా హౌస్ ప్రాంతంలోని శ్మశానవాటికను సుందరంగా తీర్చిదిద్దడం కోసం ఖాన్ దుర్వినియోగం చేస్తున్నారని మాలిక్ ఆరోపించారు. బాగానే ఉన్న గోడను కూల్చి కొత్త గోడను నిర్మించేందుకు రూ. 2.8 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.