డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య | Degree student rape and murder | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య

Jun 27 2015 4:57 AM | Updated on Jul 28 2018 8:51 PM

కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థినిని దుండగులు, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన...

బెంగళూరు(బనశంకరి): కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి వెళుతున్న డిగ్రీ విద్యార్థినిని దుండగులు, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపిన అనంతరం గొంతుకోసి హత్యచేసిన ఘటన శిరా తాలూకాలోని జవనహళ్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. శిరా తాలూకా పరిధిలోని జవనహళ్లి నివాసి రంగప్ప-రంగమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నమ్మ (20)బీఏ డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతుంది. గురువారం సాయంత్రం బడువనహళ్లిలోని నందగోకుల కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి క్లాస్ ముగించుకుని ఇంటికి బయల్దేరింది.

జవనహళ్లికి చేరుకోవాలంటే బడువనహళ్లి నుంచి గుళిగేనహళ్లిగేట్‌కు బస్‌లో వచ్చి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో బస్‌లో దిగి ఇంటికి నడుచుకుని వెళుతున్న రత్నమ్మను దుండగులు అడ్డుకుని నిర్జన ప్రదేశంలోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గొంతుకోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. అయితే కుమార్తె సాయంత్రం 5 గంటలైనా ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు గుళిగేనహళ్లి గేట్ వద్దకు చేరుకుని విచారించగా ‘‘మీ కుమార్తె 4 గంటలకే నడుచుకుని వెళుతుండడం చూశాం’’ అని అక్కడ స్థానికులు తెలిపారు.

దీంతో మరింత భయపడిన తల్లిదండ్రులు మళ్లీ జవనహళ్లికి చేరుకుని గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం గ్రామస్తులతో కలిసి జవనహళ్లికి వచ్చే కాలిబాటలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి చూడగా కొంచెం దూరంలో పాదరక్షలు కనబడ్డాయి. మరికొంత దూరంలోకి వెళ్లి చూడగా ఆమె శవం కనిపించడంతో విద్యార్థిని తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ యువతిపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు తెలుసుకున్నారు.
 
సమాచారం అందుకున్న శిరా నగర పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, శిరా గ్రామాంతర ఎస్‌ఐ రామకృష్ణయ్య తమ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్‌పీ కార్తీక్‌రెడ్డి, అదనపు ఎస్‌పీ ఆర్.లక్ష్మణ్‌కు సమాచారం అందించడంతో కార్తీక్‌రెడ్డి, ఆర్.లక్ష్మణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో తక్షణం అక్కడికి చేరుకుని దుండగుల ఆచూకీ తెలుసుకోవడంలో నిమగ్నం అయ్యారు. ఈ ఘటనతో జవనహళ్లి గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు.

శుక్రవారం ఉదయం యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి టీబీ.జయచంద్ర సంఘటనా స్దలానికి చేరుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించేదీ లేదంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూచున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం అదనపు ఎస్‌పీ.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసును తీవ్రంగా పరిగణించామని దుండగుల ఆచూకీ తెలిసిందని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు.
 
దుండుగుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు
జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి, అదనపు పోలీస్ ఎస్పీ ఆర్.లక్ష్మణ్ దుండగుల ఆచూకీకోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పోలీస్ బృందా ల్లో శిరా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, తావరకెరె ఎస్‌ఐ అంజన్‌కుమార్, శిరా గ్రామాంతర ఎస్‌ఐ రామకృష్ణయ్య, కళ్లంబెళ్ల ఎస్‌ఐ చంద్రశేఖర్, తుమకూరు గ్రామాంతర ఎస్‌ఐ. రవి, కోరా ఎస్‌ఐ. రవికుమార్ ఉన్నారు. ఇప్పటికే ఈ బృందాలు దుండుగుల ఆచూకీకోసం తీవ్రగాలింపుచర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement