వదంతులు నమ్మొద్దు.. లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

CM Clarified That There Was No Extension Of Lockdown In Bangalore - Sakshi

సీఎం యడియూరప్ప స్పష్టం 

మంత్రులతో ప్రత్యేక సమావేశం

సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ విధించినట్లు తెలిపారు.

ఈమేరకు శుక్రవారం ఉదయం బెంగళూరులోని ఎనిమిది జోన్ల ఇన్‌చార్జి మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ... ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి.. కోవిడ్, నాన్‌–కోవిడ్, హోం క్వారంటైన్‌ విషయాల గురించి చర్చించాలని మంత్రులకు సూచించారు. లక్షణాలు కనిపించని రోగులను ఇంట్లోనే క్వారంటైన్‌ ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా మృతదేహాలకు కోవిడ్‌ పరీక్షల అనంతరం నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. ఇళ్లలోనే మృతి చెందిన వారికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేసి అంత్యక్రియలు త్వరగా చేస్తే బాగుంటుందని తెలిపారు.
 
త్వరలోనే వైద్యుల భర్తీ 
వైద్యుల కొరత నివారించేందుకు పలు పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రతి వార్డులో వలంటీర్‌తో పాటు అంబులెన్సును కేటాయించామన్నారు. కోవిడ్‌ రోగులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన కోవిడ్‌ రోగులు, ఆస్పత్రిలో ఉన్న పడకల వివరాలు తెలుసుకునేందుకు వలంటీర్‌తో పాటు నోడల్‌ అధికారిని నియమించాలని మంత్రులకు సూచించారు. ప్రతి వార్డులో ఉన్న కల్యాణ మండపాలను గుర్తించి ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చాలన్నారు. (ప్లాస్మా దాతల‌కు క‌ర్ణాట‌క ప్రోత్సాహకం)

టెస్ట్‌లు పెరగాల్సిందే  
ప్రతి రోజు కోవిడ్‌ పరీక్షల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని సీఎం యడియూరప్ప సూచించారు. జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కోవిడ్‌ పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే అంబులెన్సు వారికి సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. రోగుల్లో 65 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక పడకలు కేటాయించాలన్నారు. లక్షణాలు లేని వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించాలని సూచించారు.    

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top