ప్లాస్మా దాతల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆఫ‌ర్

Karnataka Will Give Rs 5000 To Covid Plasma Donors Says Minister - Sakshi

బెంగుళూరు :  దేశంలో క‌రోనా వేగంగా విజృంభిస్తోంది. వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వ్యాధి తీవ్ర‌మ‌యి ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్ర‌యోగాత్మ‌కంగా అందిస్తోన్న ప్లాస్మా థెరపీకి ప్ర‌స్తుతం విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. అయితే దానికి తగ్గ‌ట్లు ప్లాస్మా దాతలు త‌గినంతగా ల‌భించ‌క‌పోవ‌డంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న‌వారు  పెద్ద సంఖ్య‌లో ఉన్నా అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ప్లాస్మా ల‌భించ‌డం లేదు. దీంతో దాత‌లు ముందుకు రావాలంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్మాదాత‌లు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్ర‌మంగా అధిక‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో దాత‌ల‌ను ప్రోత్సహించేలా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. క‌రోనా నుంచి కోలుకున్న వ్య‌క్తులు ప్లాస్మాను దానం చేస్తే 5000 రూపాయ‌ల‌ను ప్రోత్సాహ‌కంగా అందిస్తామ‌ని తాజాగా నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆరోగ్య‌శాఖ మంత్రి బి శ్రీరాములు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’)

దేశంలో అత్య‌ధిక ప్లాస్మా ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తున్న రెండ‌వ రాష్ర్టం క‌ర్ణాట‌క అని మంత్రి అన్నారు. దాదాపు 80 శాతం క‌రోనా రోగులు ఈ ప‌ద్ధ‌తి ద్వారా త్వ‌ర‌గా కోలుకున్నార‌ని తెలిపారు. అయితే ప్రాణ‌దాత‌లుగా గొప్ప దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యంలో దీన్ని కూడా డ‌బ్బుతో పోల్చ‌డంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను మంత్రి కొట్టిపారేశారు. ఇది ఎవ‌రినీ అవ‌మానించ‌డం కాద‌ని కేవ‌లం దాత‌ల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశం మాత్ర‌మేన‌ని అన్నారు. రాష్ర్ట రాజ‌ధాని బెంగుళూరులో క‌రోనా తీవ్ర‌రూపం దాలుస్తుంది. అన్‌లాక్ 1 ప్రారంభ ద‌శ‌లో 600 క‌న్నా త‌క్కువ ఉన్న క‌రోనా కేసుల తీవ్ర‌త ఇప్ప‌డు 22 వేలు దాటింది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 47,000 దాటింది. గ‌త 24 గంట‌ల్లోనే అత్య‌ధికంగా 3176 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. (బాదేసే బిల్లు)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top