రోజుకొక స్టింగ్‌తో చిక్కుల్లోకి ఆప్ | Cikkulloki of Sting Daily | Sakshi
Sakshi News home page

రోజుకొక స్టింగ్‌తో చిక్కుల్లోకి ఆప్

Mar 14 2015 12:31 AM | Updated on Sep 2 2017 10:47 PM

రోజుకొక స్టింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లో పెడుతోంది. మొదట మాజీ ఎమ్మెల్యే రాజేష్ గర్గ్ స్టింగ్, ఆ తరువాత మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ స్టింగ్‌లు బయటికొచ్చాయి.

సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక స్టింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లో పెడుతోంది. మొదట మాజీ ఎమ్మెల్యే రాజేష్ గర్గ్ స్టింగ్, ఆ తరువాత మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ స్టింగ్‌లు బయటికొచ్చాయి. తాజాగా ఆప్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షాహిద్ ఆజాద్ గురువారం రాత్రి బయటపెట్టిన ఆడియో టేపు కేజ్రీవాల్‌ను ముస్లిం విరోధిగా చూపించింది. ఆయన ముస్లింలకు వారి జనాభా బట్టి టికెట్లు ఇవ్వలేదని ఆజాద్ ఆరోపించారు. నరేంద్ర మోదీ భయం వల్ల ముస్లింలు ఎలాగూ ఆప్‌కే ఓటు వేస్తారు కనుక ముస్లిం అభ్యర్థులను ఎక్కువగా నిలబె ట్టనవసరం లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారని, అందుకే టికెట్లు ఇవ్వలేదని ఆజాద్ ఆరోపించారు.
 
గత నవంబర్ 24న ఆప్ మైనారిటీ విభాగం సమావేశం జరిగినప్పుడు అర్వింద్ కేజ్రీవాల్ మాటలను ఆడియో టేపులో రికార్డు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఆప్ మైనారిటీ సెల్ ముస్లింలకు 11 టికెట్లు ఇవ్వాలని కోరిందని, కానీ కేజ్రీవాల్ ముస్లింలు ఎలాగూ ఆప్ వెంట ఉన్నారు కనుక వారికి అన్ని టికెట్లు ఇవ్వనవసరం లేదని అభిప్రాయపడ్డారని ఈ టేపు వెల్లడించింది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం వల్ల ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారని ఆడియో టేప్‌లో రికార్డయిన సంభాషణ బట్టి తెలుస్తోంది. నరేంద్ర మోదీ రథాన్ని ఆపగల సామర్థ్యం ఆప్‌కు మాత్రమే ఉందని ముస్లింలు భావిస్తున్నారని, అందువల్ల వారికి ఎక్కువ సీట్లు ఇవ్వనసరం లేదని కేజ్రీవాల్ అనడం ఆడియో టేపులో రికార్డయింది.
 
పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకే...
తమ పార్టీని , కేజ్రీవాల్‌ను అప్రదిష్టపాలు చేసే  కుట్రతో ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా సంజయ్ సింగ్ తనకు మంత్రి పదవి ఇవ్వజూపిన టేపును శుక్రవారం బయటపెడతానని బెదిరించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆ టేపును బయటపెట్టలేదు. టీవీ చానెల్ ఎడిటర్ ఇంట్లో తాను సంజయ్ సింగ్‌తో మాట్లాడానని, ఎడిటర్ ఉద్యోగాన్ని కాపాడే ఉద్దేశంతో టేపును బయటపెట్టడం లేదని ఆసిఫ్ మహ్మద్ ఖాన్ చెప్పారు. ఎడిటర్  నివాసంలో తాను ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాట్లాడినట్లు సంజయ్ సింగ్ చెప్పారు. అయితే ఆసిఫ్‌కు మంత్రి పదవి ఇవ్వచూపలేదని, ఆసిఫ్ ఆడియో టేపును బయటపెట్టాలని  సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement