పైరవీలు షురూ..


‘మేయర్’ కుర్చీ కోసం తహతహలాడుతున్న కమలనాథులు

అభ్యర్థి ఎంపిక కోసం శనివారం సీనియర్ నేతల సమావేశం
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో 100 వార్డులను సొంతం చేసుకొని అధికార పీఠాన్ని దక్కించుకున్న బీజేపీలో ఇక ‘మేయర్’ కుర్చీ కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ‘మేయర్’ స్థానాన్ని దక్కించుకునేందుకు గాను ఆ పార్టీ కార్పొరేటర్‌ల మధ్య పోటీ ప్రారంభమైంది. ఆ పార్టీలోని సీనియర్ కార్పొరేటర్‌లైన నాగరాజు, పద్మనాభరెడ్డిల మధ్య ముఖ్యంగా పోటీ నెలకొంది. వీరితో పాటు కార్పొరేటర్‌లు ఎల్.శ్రీనివాస్, మంజునాథ్ రాజు, ఉమేష్ శెట్టి, ఎం.నాగరాజు, గురుమూర్తి రెడ్డిలు కూడా మేయర్ రేస్‌లో ఉన్నారు. వీరంతా పార్టీలో తమకు మద్దతుగా ఉన్న, తమ గాడ్‌ఫాదర్‌లైన నేతలతో ‘మేయర్’ కుర్చీ కోసం ఇప్పటికే పైరవీలు ప్రారంభించారు. ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చి కార్పొరేటర్‌లుగా గెలిచిన  వారికి ఈ సారి మేయర్ పీఠాన్ని కట్టబెట్టరాదనే వాదన చాలా మంది కార్పొరేటర్‌ల నుంచి వినిపిస్తోంది. మొదటి నుంచి పార్టీలోనే ఉండి పార్టీకి సేవ చేస్తున్న కార్పొరేటర్‌లకే మేయర్ పదవిని కట్టబెట్టాలని, మేయర్ ఎంపిక విషయంలో కేవలం పార్టీ నాయకత్వ అభిప్రాయమే కాకుండా, పార్టీకి చెందిన కార్పొరేటర్‌లు, బీబీఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. కాగా, ఎటువంటి అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా పార్టీ వర్చస్సును పెంచగలిగే సీనియర్ నేతకే మేయర్ పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకులు ఇప్పటికే తీర్మానించినట్లు సమాచారం.శనివారం సమావేశం కానున్న నేతలు....

ఇక ‘మేయర్’ అభ్యర్థిని ఎన్నుకొనేందుకు గాను బీజేపీ సీనియర్ నేతలు, ఈ శనివారం సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషితో పాటు కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, సీనియర్ నేతలు ఆర్.అశోక్, వి.సోమణ్ణలు ఈ సమావేశంలో పాల్గొని మేయర్ అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.ఇక ఇదే సందర్భంలో స్వతంత్య్ర అభ్యర్థులుగా గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్‌లలో కనీసం ఐదుగురిని తమ పార్టీలో చేర్చుకొని, తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top