ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కోతే! | bsm administrative section warning to the doctors | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కోతే!

Jan 4 2014 10:44 PM | Updated on Sep 2 2017 2:17 AM

ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్న వైద్యుల జీతాల్లో కోత విధించాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయించింది.

 సాక్షి, ముంబై: ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్న వైద్యుల జీతాల్లో కోత విధించాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయించింది. అదనపు సంపాదనమీద ఆశతో ఇప్పటికే ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్న కొందరిని బీఎంసీ హెచ్చరించినా వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదు. ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో పనిచేసే అనేక మంది వైద్యులకు సొంతంగా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు కూడా ఉన్నాయి.

 అయినప్పటికీ బినామీ పేర్లతో వాటిని నడుపుతున్నారు. కాగా బీఎంసీ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు మాత్రం డ్యూటీ అయిపోయిన తరువాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసుకునే అవకాశముంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలో కచ్చితంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కాని అనేక మంది డాక్టర్లు సొంత ఆస్పత్రి నుంచి నుంచి ఫోన్ రాగానే వెళ్లిపోతున్నారు. కొందరైతే అక్కడ పనులు ముగించుకుని ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు. మరికొందరు నాలుగు గంటలకు ముందే వెళ్లిపోతున్నారు. దీంతో వార్డులో రోగులకు సరైన వైద్యం లభించడంలేదంటూ బీఎంసీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ ఆస్పత్రి యాజమాన్యాలు హాజరు పుస్తకాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఉదయం రాగానే, సాయంత్రం వెళ్లేటప్పుడు అందులో కచ్చితంగా సంతకం చేయాలని ఆంక్షలు విధించింది. కాని కొందరు మధ్యలో మాయమై పనులు చూసుకుని తిరిగి వస్తున్నారు. ఇక వీరి ప్రవర్తనలో మార్పు రాదని గ్రహించిన బీఎంసీ.. పట్టుబడిన వైద్యుల జీతంలో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇలాంటి డాక్టర్లపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నిఘా వేస్తారు. వారికి కేటాయించిన వార్డులో లేని పక్షంలో వేటు వేసే యోచనలో కూడా ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement