పెయిడ్ న్యూస్ కేసులో 9 మంది | Arvinder Singh , five others held guilty of paid news | Sakshi
Sakshi News home page

పెయిడ్ న్యూస్ కేసులో 9 మంది

Dec 4 2013 11:40 PM | Updated on Mar 18 2019 9:02 PM

పెయిడ్ న్యూస్‌ను నివారించడం కోసం ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పలు పెయిడ్ న్యూస్ కేసులు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయి.

సాక్షి, న్యూఢిల్లీ: పెయిడ్ న్యూస్‌ను నివారించడం కోసం ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పలు పెయిడ్ న్యూస్ కేసులు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయి. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీతోపాటు 9 మంది అభ్యర్థులను ఈసీ పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా నిర్ధారించింది. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. అంతేకాక పెయిడ్ న్యూస్ ప్రచురించిన పత్రికలపై ఎన్నికల కమిషన్ చర్యలు  చేపట్టింది. పెయిడ్ న్యూస్ కేసులో కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, సుశీల్ గుప్తా, ముఖేష్ శర్మలను దోషులుగా నిర్ధారించింది. లవ్లీ గాంధీనగర్ నుంచి, గుప్తా మోతీనగర్ నుంచి , శర్మ ఉత్తంనగర్ నుంచి పోటీచేశారు.
 
 బీజేపీ చెందిన నీల్ దమన్ ఖత్రీ, జయ్‌ప్రకాశ్, మనోజ్ షౌకీన్, రాజీవ్ బబ్బర్‌లను కూడా పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా గుర్తించారు. ఖత్రీ నరేలా నుంచి, జయ్‌ప్రకాశ్ సదర్ బజార్ నుంచి, షౌకీన్ నంగ్లోయ్ జాట్ నుంచి, బబ్బర్ తిలక్ నగర్ నుంచి పోటీచేశారు. బీఎస్పీకి చెందిన ధీరజ్‌కుమార్ టోకస్, సలీం సైఫీలను కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. టోకస్ ఆర్‌కేపురం నుంచి, సైఫీ నంగ్లోయ్ జాట్ నుంచి పోటీచేశారు. పెయిడ్ న్యూస్ ఆరోపణలు రావడంతో ఈ అభ్యర్థులకు నోటీసులు పంపామని, అయితే వారిచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు చేపట్టామని ఎన్నికల ప్రధానాధికారి  విజయ్‌దేవ్ చెప్పారు.
 
 పెయిడ్ న్యూస్ కోసం వారు చేసిన ఖర్చును వారి ఎన్నికల వ్యయంలో చేర్చనున్నట్లు ఆయన చెప్పారు.  ఎన్నికల కోసం వారు చేసిన మొత్తం ఖర్చును పరిశీలించి నిర్ధారిస్తామని, వారి వ్యయం పరిమితిని మించినట్లయితే గెలిచిన అభ్యర్థుల ఎన్నికను రద్దు చేస్తామని ఆయన చెప్పారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 60 ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. వాటిలో 8 ఆరోపణలు పెయిడ్ న్యూస్ కావని తేల్చామని, 28  కేసులలో నోటీసులు జారీ చేశామని, మరో 24 కేసులలో నోటీసులు జారీచేయవలసి ఉందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement