గుంటూరులో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ | AP's first Smart Police Station to be inaugurated | Sakshi
Sakshi News home page

గుంటూరులో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌

Feb 7 2017 6:42 PM | Updated on Aug 24 2018 2:36 PM

స్మార్ట్‌పోలీసింగ్‌లో భాగంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

పట్నంబజారు (గుంటూరు) : గుంటూరులో నూతనంగా ఏర్పాటుచేసిన నగరంపాలెం, పాతగుంటూరు మోడల్‌ పోలీస్‌స్టేషన్‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లోనే పాతగుంటూరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హెలికాప్టర్‌లో బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి నేరుగా చేరుకున్న ఆయన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

డీజీపీ నండూరి సాంబశివరావు, ఇతర పోలీసు అధికారులు సీఎంకు స్వాగతం పలికగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులకు రేంజ్‌ ఐజీ ఎన్‌.సంజయ్, అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్‌ ఎస్పీ జె.భాస్కరరావు ఆహ్వానం పలికారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

పోలీసు నియమావళి పుస్తకావిష్కరణ...
సభా ప్రాంగణంలో పోలీసు నియమావళి పుస్తకాన్ని డీజీపీ సాంబశివరావు విజ్ఞప్తి మేరకు సీఎం ఆవిష్కరించారు.
2001 సంవత్సరం తరువాత పోలీసు మాన్యువల్‌ను మరోసారి సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు తెలిపారు. అనంతరం గత ఏడాది నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షల్లో అర్హత సాధించిన 4500 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏపీ పోలీసులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్‌ స్మార్ట్‌ కార్డులను ఆవిష్కరించారు. పోలీసుల వైద్య పరీక్షల కోసం అత్యవసరంగా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పోలీసు ఈ–లెర్నింగ్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.

పలువురికి ప్రశంసా పత్రాలు...
పోలీసు శాఖలోని క్రైం విభాగంలో నిందితులు, దొంగలను పట్టుకోవటంతో పాటు భారీ కేసులను ఛేదించిన నలుగురికి ఎ, బి, సి, డి.. ప్రాతిపదికన ప్రశంసాపత్రాలు, అవార్డులను అందజేశారు. దీనిలో ‘ఎ’ కింద కర్నూలుకు చెందిన డీఎస్పీ అశోక్‌కుమార్, రాజమండ్రి సీఐ
రవికుమార్, విజయవాడ సీఐ సహేరా, అడిషనల్‌ డీజీ అతుల్‌సింగ్‌లకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

కార్యక్రమంలో పోలీసు అధికారులు హోం శాఖ కార్యదర్శి అనురాధ, విజయవాడ నగర కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్, అడిషనల్‌ డీజీలు ఠాగూర్, ద్వారక తిరుమలరావు, సురేంద్రబాబు, ఐజీలు సునీల్‌కుమార్, మహేష్‌ చంద్ర లడ్హా, హరీష్‌కుమార్‌ గుప్తా, ఎన్‌.సంజయ్, రమణకుమార్, కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, గుంటూరు అర్బన్, రూరల్‌ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణ నాయక్, పీæవీఎస్‌ రామకృష్ణ, హరికుమార్, రాజకుమారి, గోపీనాథ్‌ జెట్టి, కోటేశ్వరరావు, నగర కమిషనర్‌ నాగలక్ష్మి, జేసీ కృతికా శుక్లా, జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్, ఎమ్మెల్యేలు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement