మాలయకోటలో పేలిన తూటాలు

మాలయకోటలో పేలిన తూటాలు - Sakshi

► పెద్ద శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు  

► పోలీసులు విస్తృతంగా తనిఖీలు 

► అడవి జంతువులకు పెట్టే తూటాలుగా నిర్ధారణనాయుడుపేట : పట్టణ శివారు ప్రాంతం మాలయకోట (మునిరత్నంనగర్‌)లో సోమవారం సాయంత్రం పెద్ద శబ్దంతో రెండు తూటాలు పేలాయి. పేలుడు శబ్ధానికి ఇళ్లలో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. నడిబజారులో జరిగిన ఈ ఘటనలో ఓ వీధి కుక్క నోటి వద్ద గాయపడి ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణనష్టం జరిగిందోనని, ఎవరికి ఏమైందోనని ఇరుగు పొరుగు వారిని ఆరా తీశారు. స్థానికుల సమాచారం మేరకు.. మాలయకోటలో సాయంత్రం 5 గంటల సమయంలో ఓ కుక్క అక్కడ పడి ఉన్న ప్లాస్లిక్‌ సంచిలో పేగులను తినే క్రమంలో పెద్ద శబ్దంతో తూటా పేలింది. దీంతో కుక్క రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే మరో తూటా పడి ఉండటంతో స్థానికులు అది కూడా పేలుతుందని భావించి నిర్వీర్యం చేసేందుకు నీళ్లల్లో వేసేందుకు తీసుకెళ్లారు. అయితే మళ్లీ దూరంగా పెట్టి దానిపై ఇటుక రాయి విసిరారు. దీంతో అది కూడా పేలి, దాని ధాటికి ఇటుక రాయి ముక్కలుముక్కలైంది.

 

పోలీసులు పరుగులు

మునిరత్నంనగర్‌లో బాంబులు పేలాయంటూ పోలీసులకు సమాచారం అందడటంతో సీఐ రత్తయ్య, పెళ్లకూరు, దొరవారిసత్రం ఎస్సైలు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న శునకాన్ని పరిశీలించారు.  పక్కనే పడి ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు అందులో ఉన్న పేగులను గుర్తించారు. శునకానికి నలువైపుల ఉన్న దారపు పీసులను క్షుణ్ణంగా పరిశీలించారు. పేలింది నాటు బాంబు కాదని పంటలు నాశనం చేసే అటవీ జంతువుల కోసం రైతులు పెట్టే తూటాలుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు ఘటన స్థలానికి సమీపంలో ఉన్న పలువురి ఇళ్లల్లోని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మాలయకోటలోని ప్రతి ఇంటిని సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top