అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం! | Ajanta Ellora Caves | Sakshi
Sakshi News home page

అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం!

Dec 16 2013 12:43 AM | Updated on Sep 2 2017 1:39 AM

అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం!

అజంతా అందాలకు సీతా‘కోక’ల సింగారం!

అజంతా గుహల అందాలకు పంచవన్నెల సీతాకోక చిలుకల అందాలు మరింత శోభను చేకూర్చనున్నాయి.

ఔరంగాబాద్: అజంతా గుహల అందాలకు పంచవన్నెల సీతాకోక చిలుకల అందాలు మరింత శోభను చేకూర్చనున్నాయి. ఇకపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన అజంతా గుహలను సందర్శించే పర్యాటకులకు గుహల అందాలతోపాటు రం గురంగుల సీతాకోకచిలుకల సోయగాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
 
 అటవీ ఉమ్మడి యాజమాన్య కమిటీ(జేఎఫ్‌ఎంసీ)తో కలిసి అటవీ శాఖ అధికారులు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. గుహల సమీపంలో, కొండ కింద జలపాతాల దిగువ ప్రాంతంలో సీతాకోక చిలుకలను ఆకర్షించే వాతావరణాన్ని కల్పిం చేందుకు కృషిచేయనున్నా రు. ఈ విషయమై అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అజిత్ భోంస్లే మాట్లాడుతూ..‘ అజంతా గుహల సమీపంలో రెండు కిలోమీటర్ల దూరం వరకు సీతాకోక చిలుకలను ఆకర్షించేందుకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచాలని నిర్ణయించాం..’ అని అన్నారు. ‘ఈ ప్రదేశం లో ఎక్కువగా పుష్పించే వృక్షజాతులు ఉండటంతో వివిధ రకాల సీతాకోక చిలుకల ఉనికి ఇక్కడ స్పష్టంగా ఉంది. మేము ఈ వాతావరణాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ జాతుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.
 
 గుహలను సందర్శించేందుకు వచ్చే సందర్శకులకు ఈ సీతాకోక చిలుకలు అదనపు ఆనందాన్ని కలి గిస్తాయి..’ అని ఆయన చెప్పారు. సాధారణంగా వసంతకాలం, సీతాకాలాల్లో మాత్రమే సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే తాము వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా ఏడాది పొడవునా సీతాకోకచిలుకలు సందర్శకులను అలరించేలా చర్యలు తీసుకుంటున్నామని భోంస్లే తెలిపారు. వచ్చే ఏడాది జూన్-జూలై నుంచి తమ ప్రణాళిక అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పర్యాటకాభివృద్ధిలోభాగంగా గుహల సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు ఎకరాల స్థలంలో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు భోంస్లే చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్న ఒక స్థలాన్ని ఉద్యానవనంగా మార్చి తీర్చిదిద్దనున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. పనికిరాని మొక్కలను, చెత్తచెదారాన్ని తొలగింపు పనులు నడుస్తున్నాయని చెప్పా రు. దీంతో పర్యాటకులు జలపాతాల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచివెళ్లి సందర్శించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి గుహల వద్ద పారిశుద్ధ్య సంరక్షణ నిమిత్తం సందర్శకుల నుంచి ‘న్యూసెన్స్ ఫీ’ కింద రూ.10 వసూలు చేయనున్నామని భోంస్లే చెప్పారు.
 
 కాగా, ఇటీవల అజంతా గుహలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ(అటవీ) ప్రవీణ్ పరదేశీ, ఔరంగాబాద్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ మెయిపోకం అయ్యర్ సందర్శించి అటవీ శాఖ చేసిన ప్రతిపాదనలను ఆమోదించారని అజిత్ భోంస్లే వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement