
ప్రాచీన కుడ్యచిత్రంలోని నౌకకు నేవీ ప్రాణప్రతిష్ట
ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యను రూపొందించిన వైనం
కర్వార్(కర్ణాటక): ప్రఖ్యాత అజంతా గుహలోని ఒక శిలపై చిత్రించిన పెయింటింగ్ నుంచి స్ఫూర్తి పొందిన భారత నావికాదళం ఎట్టకేలకు ఐదో శతాబ్దినాటి పడవకు ప్రాణప్రతిష్టచేసింది. ప్రాచీన భారతీయ నావికా సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా ఈ నౌకను రూపొందించింది. కర్ణాటకలోని వ్యూహాత్మకమైన కర్వార్ నావికా స్థావరంలో ఈ పురాతన సంప్రదాయక రీతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యను ఇండియన్ నేవీ బుధవారం ఆవిష్కరించింది.
ఒకటో శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్ర యానం చేసి ఆగ్నేయాసియాను చుట్టొచ్చిన ప్రఖ్యాత భారత నావికుడు కౌండిన్య పేరును ఈ ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్(ఐఎన్‌ఎస్‌వీ)కి పెట్టారు. ఈ నౌకకు ఎన్నో విశిష్టతలున్నాయని దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం చెప్పారు. ఆధునిక తరం నౌకలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైంది.
నీటిలో మునిగే ప్రధాన భాగం, చదరపు తెరలు, వేరే ఆకృతిలో తెడ్డులతో దీనిని సహజ ముడి సరుకులతో నిర్మించామని నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ‘‘ ఈ నౌకకు సంబంధించిన వాస్తవ కొలతల మ్యాప్‌లు, బ్లూప్రింట్‌లు అందుబాటులో లేవు. ద్విమితీయ చిత్రంలో ఉన్న ఒక్కో అంశాన్ని స్పష్టంగా అర్థంచేసుకుని వాటినే కొలతలుగా భావించి వాస్తవిక ఊహతో నౌక నిర్మాణం మొదలెట్టాం.
పురాతన నౌక నిర్మాణాలు, నౌకా నిర్మాణ శాస్త్రం, సాంప్రదాయక విధానాలను మేళవిస్తూ ఈ నౌక సముద్ర పరిస్థితులను ఏ విధంగా తట్టుకోగలదనే అంచనాతో నౌకకు తుదిరూపునిచ్చాం’’ అని నేవీ అధికారి తెలిపారు. ‘‘భారతీయుల సముద్రయాన ఘనతను, వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఆనాటి నిర్మాణ కౌశల్యాన్ని కళ్లముందే సాక్ష్యాత్కరిస్తోంది’’ అని మంత్రి షెకావత్ అన్నారు. పురాతన విధానంలో నిర్మించిన ఈ నౌక పనితీరు, సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు త్వరలోనే దీనిని గుజరాత్ తీరం నుంచి ఒమన్‌కు నడపనున్నారు.