నకిలీ పత్రాలను సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రంజిత్‌సింగ్‌ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: నకిలీ పత్రాలను సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రంజిత్‌సింగ్‌ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గోకుల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన రంజిత్ సింగ్ తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా నకిలీ పత్రాలను సమర్పించారని ఆప్ ఆరోపించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఆయన శాసనసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేస్తూ అనర్హుడిగా ప్రకటించాలని ఆప్ డిమాండ్ చేసింది.
నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రంజిత్‌సింగ్ కేవలం ఎన్నికల సంఘాన్ని మాత్రమే కాకుండా ప్రజలను కూడా మోసగించాడని ఆప్ ఆరోపించింది. ఇటువంటివారిపై చర్య తీసుకోకుండా వదిలేస్తే అది రానున్న రోజుల్లో రాజకీయాల్లో తీవ్ర సమస్యగా మారే అవకాశముందని ఆప్ హెచ్చరించింది. బీజేపీ రాజకీయాలకు రంజిత్‌సింగ్ ఎన్నికల ఓ ఉదాహరణగా చెప్పవచ్చని ఎద్దేవా చేసింది. దీనిపై బీజేపీ తన వైఖరి ఏమిటో వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేసింది.