త్రీడీ సినిమాలా స్త్రీ జీవితం | 3D movies in a woman's life | Sakshi
Sakshi News home page

త్రీడీ సినిమాలా స్త్రీ జీవితం

Feb 27 2014 12:37 AM | Updated on Sep 2 2017 4:07 AM

నేటి సమాజంలో స్త్రీ జీవితం త్రీడీ సినిమాలా తయారైందని ఓ మహిళ అభిప్రాయపడ్డారు. చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలకు రక్షణ కరువైందని

చెన్నై, సాక్షి ప్రతినిధి: నేటి సమాజంలో స్త్రీ జీవితం త్రీడీ సినిమాలా తయారైందని ఓ మహిళ అభిప్రాయపడ్డారు. చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలకు రక్షణ కరువైందని మరో మహిళ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు కాదు వ్యక్తుల ఆలోచన ధోరణిలో మార్పురావాలని మరో వనిత అభిప్రాయపడ్డారు.  ఆలిండియా రేడియో (చెన్నై), ఆంధ్ర మహిళా సభ సంయుక్తంగా మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా వారోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై బుధవారం ‘వనితావాణి’ పేరుతో మహిళా అభిప్రాయ వేదికను నిర్వహించారు. సుమారు 20 అంశాలను నిర్వాహకులు సభ ముందుంచారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు, గృహిణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
 
 పెళ్లంటే నూరేళ్ల పంట అనే నానుడి  కాలక్రమేణా సంవత్సరాలు, నెలలు, రోజులకు దిగజారిపోయిందని లావణ్య పేర్కొన్నారు. పెళ్లివేడుకల్లో  హంగులు హడావుడికేగానీ అందులోని అంతరార్థానికి తావులేకుండా పోయిందన్నారు. అందువల్లనే డొమెస్టిక్ వయలెన్స్, డౌరీ హరాస్‌మెంట్, డైవర్స్ అనే త్రీడీ సినిమాగా మహిళ జీవితం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ వసంత మాట్లాడుతూ ప్రతి స్త్రీకి ఓర్పు, సహనం, క్షమాగుణం, మనో ధైర్యం వంటి అవసరమని పేర్కొన్నారు. పెళ్లినాటికే విలాసవంతమైన జీవితాన్ని ఆశించడం వల్ల అనేక  కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయని శారద అన్నారు. సర్దుబాటు, నమ్మకం, అర్థం చేసుకోవడం ద్వారా కాపురాలను కాపాడుకోవచ్చన్నారు. 
 
 ఇంటినే కాదు పర్యావరణ పరిక్షణలోనూ స్త్రీపాత్ర ఉందని మాజేటి జయశ్రీ గుర్తుచేశారు. సంసార పరంగా వివిధ బాధ్యతలు నిర్వర్తించే స్త్రీమూర్తి ముందుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నపుడే భర్త, పిల్లలకు న్యాయం చేయగలుగుతుందని జానకి పేర్కొన్నారు. డైటింగ్ పేరుతో గృహిణి కడుపు మాడ్చుకోరాదని, పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని స్వీకరించాలని శ్యామల పేర్కొన్నారు. పెళ్లిళ్లలో పండితులు చదివే మంత్రాల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని పట్టించుకోవడం మానివేశారని, కాపురాల విచ్ఛిన్నానికి ఇది ప్రధాన కారణమని కనకదుర్గ అన్నారు. మహిళాదినోత్సవాలు ఎలా ప్రారంభమయ్యూయో బోడపాటి కృష్ణవేణి వివరించారు. ఉప్పులూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆనందం అనేది ఒక మానసిక స్థితి, ఇష్టమైన పనులను ఆచరిస్తే అనందం అందరి సొంతమని అన్నారు.
 
  సభాధ్యక్షురాలు శ్రీమతి రామనాథన్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన లెక్కల ప్రకారం మహిళలపై ప్రతి 26 నిమిషాలకు ఒక వికృత చేష్ట, 34 నిమిషాలకు అత్యాచారం, 43 నిమిషాలకు కిడ్నాప్,  93 నిమిషాలకు హత్య, 102 నిమిషాలకు రేప్‌డెత్ నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1991-71 మధ్యకాలంలో వరకట్న చావులు 71 శాతానికి చేరుకున్నాయని ఆవేదన చెందారు. కార్యక్రమం మధ్యలో శారద, జయంతి, అముక్తమాల్యద, ఉమ, సింధూరీ, వసుంధర పాటలను ఆలపించారు. ఆస్కా అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి, ఆలిండియా  రేడియో ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నాగసూరి వేణుగోపాల్, వ్యాఖ్యాత గజ గౌరీ, ఆంధ్రమహిళా సభ మాజీ అధ్యక్షురాలు అక్కమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు జ్ఞాపికలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement