womans life
-
సహజమైన మార్పు ఇది.. మనమూ మారుదాం!
గైనకాలజిస్ట్లు, సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, లైఫ్ కోచ్‌లు.. అందరూ చెబుతున్నదీ, అవగాహన పెంచుతున్నదీ.. మెనోపాజ్‌తో మహిళ జీవితం అయిపోదని, అదొక ఫేజ్ అని, సహజమైన మార్పు అనే! దాన్ని ఆమె సాఫీగా దాటి.. లైఫ్‌ని ఉత్సాహంగా రీస్టార్ట్ చేయాలంటే ఆ దశ మీద అందరికీ అవగాహన ఉండాలని! ఆ ఉద్దేశాన్ని ఈ క్యాంపెయిన్ కాస్తయినా నెరవేర్చిందని.. సైలెంట్‌గా ఉన్న ఆ అంశాన్ని చర్చలోకి తెచ్చిందని భావిస్తున్నాం! మెనోపాజ్ గురించి మరికొందరు నిపుణులు చెబుతున్న మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..మెనోపాజ్‌ను మనతో సహా తూర్పుదేశాలన్నీ పాజిటివ్‌గానే చూస్తున్నాయి. ఇది మహిళ జీవితంలో అత్యంత సహజమైన దశ. సింప్టమ్స్ తీవ్రంగా ఉండి దైనందిన జీవితం కూడా కష్టమైప్పుడు తప్ప దీన్ని దాటడానికి మెడికల్ సపోర్ట్ అంతగా అవసరం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఆసక్తికరమైన మార్పు. కాబట్టి దీని గురించి మాట్లాడ్డానికి సిగ్గుపడనక్కర్లేదు. బిడియం అంతకన్నా వద్దు. 45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయమూ లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి! కుటుంబాలకు ఆ అవగాహన రావాలంటే పెరిమెనోపాజ్లోని మహిళలు తాము అనుభవిస్తున్న శారీరక, మానసిక సమస్యల గురించి కుటుంబానికి చెప్పాలి. చర్చించాలి. అప్పుడే ఆమె పరిస్థితిని కుటుంబం అర్థం చేసుకోగలదు. అండగా నిలబడగలదు. అంతేకాదు ఆ దశలోని మహిళలు తమ మానసిక భారాన్ని తేలిక చేసుకోవడానికి పదిమందితో కలుస్తూ .. మాట్లాడుతూ ఉండాలి. నడివయసు స్త్రీలలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. అయితే వయసుతో వచ్చిన మార్పులేమిటీ, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చిన మార్పులేమిటో కనుక్కోవడం కష్టమే! సమస్యలు తీవ్రంగా ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహిళ వైద్యులను సంప్రదించాలి. ఆమె చెప్పింది వైద్యులు శ్రద్ధగా విని, అవసరమైన సలహాలు, సూచనలతో ఆమె ఆ దశను సాఫీగా దాటేలా సాయం చేస్తారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల పెరిమెనోపాజ్ పట్ల సమాజంలో అవగాహన కలిగే అవకాశం ఉంది.కష్టం లేకుండా పెరిమెనోపాజ్ దశను దాటేందుకు కొన్ని చిట్కాలు...డైట్ : పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం భోజన మోతాదును, అందులోని అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి కానీ పూర్తిగా భోజనాన్నే మానేయకూడదు! రోజు మొత్తంలో తీసుకునే భోజనంలో 30 శాతం లేదా అంతకంటే తక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫ్యాటీ మీట్స్, హోల్ మిల్క్, ఐస్‌క్రీమ్స్, చీజ్ లాంటివాటికీ దూరంగా ఉండాలి. మసాలానూ దరిచేరనివ్వద్దు. చక్కెర, ఉప్పునూ తగ్గించాలి. గ్రిల్డ్, స్మోక్ ఫుడ్‌కీ నో చెబితే మంచిది. ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు నీటిని తాగాలి. మద్యం పూర్తిగా మానేయాలి. కాఫీ తగ్గించాలి. వ్యాయామం: క్రమం తప్పని వ్యాయామంతో శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. అందుకే రోజూ 45 నిమిషాల పాటు కచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్,ప్రాణాయామాన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్రియేటివ్ వర్క్‌ని వెదుక్కోవాలి. ఇది ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు, చుట్టాలు, స్నేహితులతో కలుస్తుండాలి. హాట్ ఫ్లషస్ ఇబ్బందిగా మారితే.. వాటిని ట్రిగర్ చేస్తున్నవేవో గమనించి వాటికి దూరంగా ఉండాలి. పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. వాకింగే కాక స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్ ఇలా ఇష్టమైనదాన్ని ఎంచుకోవచ్చు. విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవాలి. 40 నుంచి 60 గ్రాముల సోయా ప్రొటీన్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటన్నిటి సహాయంతో పెరిమెనోపాజ్ దశను హాయిగా దాటేయొచ్చు. – డాక్టర్ ప్రణతి రెడ్డిక్లినికల్ డైరెక్టర్, రెయిన్బో హాస్పిటల్స్45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయం లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి!పాజ్ నుంచి పుంజుకుందాం.. మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన ప్రక్రియ. దీని తర్వాత కూడా ఆమెకు 30 ఏళ్లు పైబడిన ఆరోగ్యకర మైన, చురుకైన జీవితం ఉంటుంది. అందుకే మెనోపాజ్‌లో వచ్చే మార్పులు, సమస్యల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం అత్యంతవసరం! ఈ దశలోని శారీరక మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. హాట్ ఫ్లషస్.. ఆ వెంటనే చెమటలు పట్టడం వంటివి మహిళ దైనందిన జీవితాన్ని ఇబ్బందిగా మారుస్తాయి. వెజైనల్ డ్రైనెస్ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అది ఆమెలో ఆందోళనకు తద్వారా ఇతర మానసిక సమస్యలకూ దారీతీయవచ్చు. ఈ సమయంలో కొందరు మహిళలు బరువు పెరుగుతారు. కీళ్లనొప్పులు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివీ అనుభవంలోకి వస్తుంటాయి. ఇవన్నీ మానసిక ఇబ్బందులకు దారితీస్తుంటాయి. ఈ మొత్తంలో ప్రధానంగా చర్చించుకోవాల్సింది మెనోపాజ్‌లో వచ్చే డిప్రెషన్ లేదా కుంగుబాటు గురించి. మహిళలకు మెనోపాజ్ కంటే ముందు డిప్రెషన్ ఉన్నా లేకపోయినా.. ఈ దశలో దీనిబారినపడే ప్రమాదం రెండు నుంచి నాలుగింతలు ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ టైమ్‌లో కుటుంబం ఆమెకు అండగా నిలవాలి. కానీ మన దేశంలో దీని పట్ల సరైన అవగాహన లేక కుటుంబాల నుంచి కోరుకున్న మద్దతు లభించట్లేదు. అందుకే మెనోపాజ్ ప్రభావాన్ని కుటుంబమూ అర్థం చేసుకొని, అవగాహన పెంచుకోవాలి. మెనోపాజ్ తర్వాతా ఆమె జీవితం సాఫీగా సాగిపోయేలా సహకరించాలి. లేకపోతే ఒత్తిడి పెరిగి అది ఆమెను వేగంగా వృద్ధాప్యానికి చేరువచేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు ఏమాత్రం కనపడినా జంకు, సందేహం లేకుండా వెంటనే మానసిక వైద్యనిపుణులను కలవాలి. ఏ మానసిక సమస్యకైనా కౌన్సెలింగ్ రూపంలోనో.. మందులో రూపంలోనో.. ఇంకే ఇతర సపోర్ట్ రూపంలో అయినా చికిత్స ఉంటుంది. దానికంటే ముందు మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్, మెడిటేషన్‌ను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమస్యలను సాటి మహిళలతో పంచుకోవడానికి, చర్చించడానికి సందేహించవద్దు. షేరింగ్ వల్ల ఆందోళన, భయం తగ్గుతాయి. భరోసా వస్తుంది. అంతేకాదు ఆ చర్చల వల్ల సమాజంలోనూ దీనిపట్ల అవగాహన పెరుగుతుంది. ఇది జీవితంలో మళ్లీ పుంజుకోవడానికి సాయపడుతుంది.– డాక్టర్ అల్లం భావన, సైకియాట్రిస్ట్ఫిట్నెస్ పెంచుకుందాం... మెనోపాజ్ అనగానే జీవితం అయిపోయిందని భావించడమో, ఇక ఉపయోగం లేదని అనిపించుకోవడమో, తమ అవసరాన్ని ఎవరూ గుర్తించరనే భయమో కలుగుతుంది. నిజానికి ఇప్పుడే జీవితానికి కొత్త అర్థం మొదలవుతుంది. ఈ దశలో ఫిట్నెస్ చాలా కీలకం. ఫిట్నెస్ పెంచుకోవాలి. బ్రిస్క్ వాకింగ్, యోగా (భుజంగాసనం, చైల్డ్ పోజ్, శవాసనం లాంటివి),ప్రాణాయామం శరీరకంగా, మానసికంగా ఉపశమనాన్నిస్తాయి. సమతుల (కాల్షియం, విటమిన్ డి, ఒమేగా 3, ఫైబర్,ప్రొటీన్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌తో కూడిన) ఆహారం, తగినంత వ్యాయామంగల ఆరోగ్యకర జీవనశైలి మెనోపాజ్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఒంటరితనం, దిగులుకు లోనవకుండా కొత్త యాక్టివిటీ మొదలుపెట్టాలి. ఫ్రెండ్స్‌తో గ్రూప్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూండాలి. మహిళ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఆమె మనసు, భావోద్వేగాలు కూడా! ఈ కోణంలో కుటుంబం మెనోపాజ్ దశలోని మహిళను అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆమె ఆ దశను ఆనందంగా మలచుకుంటుంది.. ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. – రజిత మైనంపల్లి, లైఫ్ కోచ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, యోగా అండ్ డైట్ ఎక్స్పర్ట్సిద్ధమైపోవాలంతే!అప్పటిదాకా బాధ్యతల్లో మునిగిపోయిన మహిళకు తన జీవితాన్ని తనకు నచ్చినట్టు మలచుకునే ఒక వెసులుబాటు మెనోపాజ్! పీరియడ్స్ ఆగిపోవడం వలన శారీరకంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ పీరియడ్స్ వల్ల అప్పటిదాకా ఉన్న కొన్ని అసౌకర్యాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ప్రయాణాలకు, కొత్త ప్రయత్నాలకు పీరియడ్స్ ఆటంకం ఉండదు. ఫ్యామిలీ ప్లానింగ్ బాధ్యతను మోసే బెడదా తప్పుతుంది. ఒక స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ సానుకూలతల పట్ల దృష్టి నిలిపి.. మనసుకు ఉత్సాహాన్ని పట్టించి.. వయసుకు రెక్కలు తొడిగి రీస్టార్ట్‌కు సిద్ధమైపోవాలంతే!– శిరీష చల్లపల్లినిర్వహణ: సరస్వతి రమ -
Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్‌లను నేర్చుకుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్‌గా మారింది. ‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు. -
అమ్మ.. ఈ వరుసకు లేదు నిర్వచనం
జన్మజన్మలకూ తీర్చుకోలేని రుణబంధం మహిళ జీవితం త్యాగాలమయం. పుట్టినప్పటి నుంచి మట్టిలో గిట్టే వరకు ప్రతి అడుగు పురుషుడి ఎదుగుదల కోసమే ఆమె పరితపిస్తుంది. కష్టసుఖాల్లో తోడూ, నీడగా ఉంటుంది. కూతురిగా, చెల్లిగా, భార్యగా, వదినగా, కోడలిగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా.. ఇలా ఎన్నో రూపాల్లో స్త్రీమూర్తి పురుషుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉన్నా వెన్నంటి ఉండిపురుషుడి వెలుగు దివ్వె అవుతోంది. అలాంటి అపురూపమైన వ్యక్తిత్వం ఉన్న ఆడవారు నేడు ఆపదలో ఉన్నారు. రకరకాల దాడులు, హింసలకు గురవుతున్నారు. అలాంటి మహిళలను రక్షించుకుందాం. అండగా నిలిచి ఆపదలో ఆదుకుందాం. ఆ మాటకొస్తే ఆపదే రాకుండా అడ్డుకుందాం. ఆడవారి రుణం తీర్చుకుందాం. మగవాడి జీవితంలో విడదీయని బంధంగా ఉన్న ఆడ(జన్మ) వారిపై ప్రత్యేక కథనం. - బెల్లంపల్లి అలసట తీర్చే చిన్నారి నవ్వులు ఇంట్లో పసిపాప ఉంటే ఆ కుటుంబం హరివిల్లవుతుంది. దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఇంటికి వచ్చిన ఆ తండ్రికి ఆ చిన్నారి కూతురి పలకరింపు సంతోషానిస్తుంది. అంతకన్నా మించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అప్పటి వరకు ఉన్న చికాకు తొలగిపోయి స్వాంతన చేకూరుతుంది. బుడిబుడి నడకలతో ఎదురేగి పలకరించే ఆ చిన్నారి ముచ్చట్లు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఓ కూతురిగా తనకు తెలియకుండానే ఆ చిన్నారి తల్లిదండ్రుల జీవితంలో వెలకట్టలేని సంతోషాన్ని ఇస్తుంది. సంబరాలను నింపుతుంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కావొచ్చు కంటే కూతుర్నే కనాలని. ఇంటికి వెలుగు ఇల్లాలు పురుషుడి జీవితంలో సగభాగంగా మారే మహిళ జీవితం మహోన్నతమైంది. ఏడడుగులు నడిచి, మూడుముళ్లతో ఒక్కటైనా ఆమె బంధం మగాడి జీవితంతో పెనవేసుకుంటుంది. భర్తకు చేదోడు, వాదోడుగా ఉంటూనే సంసార సాగరాన్ని నెట్టుకొస్త్తుంది. అందుకే కాబోలు ఏ సమస్య ఎదురైనా భర్త ముందుగా భార్యతోనే చెప్పుకుంటాడు. ఆమె సహకారాన్ని అర్థిస్తాడు. చికాకులు, చీదరింపులతో ఇంటికి వచ్చే భర్తతో సన్నిహితంగా మెలిగి ఊరట కల్పిస్తుంది భార్య. కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపజేసి సమాజంలో భర్త పాత్రకు ఔనత్యాన్ని కల్పిస్తుంది. అన్నింటికీ మించి ఆ ఇంటికి ఇల్లాలు దీపమై వెలుగునిస్తుంది. భర్త, కుటుంబాన్ని సర్వస్వంగా భావించి జీవితాన్ని అంకితం చేస్తుంది. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా భర్త వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తుంది. భరోసా కల్పించి, బతుకుబాట చూపిస్తుంది. బాధ్యతలను గుర్తు చేసి భర్తను సన్మార్గంలో పెడుతుంది. అమ్మ.. ఈ వరుసకు లేదు నిర్వచనం ఆడజన్మ అందించే అన్ని వరుసల్లో అత్యున్నతమైనది అమ్మ. అందరి సేవలకన్నా ఓ మెట్టు పైన నిలిచేది అమ్మ. సృష్టిలో అమ్మను మించిన దైవం మరొకటి లేదు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. పురుటినొప్పుల బాధ అనుభవించి పురుడుపోస్తుంది. అల్లారుముద్దుగా పెంచి కంటికి రెప్పలాగా కాపాడుతుంది. ఎంత కష్టమొచ్చినా బిడ్డకు గోరుముద్దలు తినిపించి సంబురపడుతుంది. కొడుకుకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి మనసు తల్లడిల్లుతుంది. కష్టం కడతేరే వరకు పరితపిస్తుంది. బిడ్డ ఎదుగుదలను కోరుకుంటుంది. మంచి నడవడికను నేర్పుతుంది. కొడుకు ఉన్నత స్థితికి ఎన్ని కష్టనష్టాలనైనా అనుభవిస్తుంది. పడరాని పాట్లు పడుతుంది. కాటికెళ్లే వరకు కొడుకు భవిష్యత్‌నే ఆ తల్లి కోరుకుంటుంది. కోటి ఆశల కోడలు ఇంటి బరువు బాధ్యతలన్నీ కోడలిపైనే ఉంటాయి. ఆ కుటుంబం వృద్ధి చెందడానికి, సమాజంలో గౌరవ, మర్యాదలు పొందడానికి కోడలు కీలకమవుతుంది. ఇదంతా ఆమె నడవడికపైనే ఆధారపడి ఉంటుంది. అత్త తర్వాత ఇంటి పెత్తనం కోడలిదే అవుతుంది. అందుకే ఇంటికొచ్చే కోడలిపైనే ఆ కుటుంబం కోటి ఆశలు పెంచుకుంటుంది. కోడలిగా అత్తా, మామలకు సపర్యలు చేస్తుంది. వృద్ధాప్యంలో కూతురిలా చూసుకుంటుంది. ముఖ్యంగా భర్త తరఫు బంధువులను, తోబుట్టువులను చూసుకోవడంలో మర్యాదలు చేయడంలో ఇంట్లో కోడలి పాత్ర ముఖ్యమైనది. ఇంటిల్లిపాదికి తలలో నాలుకలా వ్యవహరించి కోడలిగా కుటుంబంలో ఒదిగిపోతుంది. అత్తను మించిన ఆప్యాయతలను పంచి రుణం తీర్చుకుంటుంది. మార్గదర్శిగా వదిన అన్న భార్యగా ఇంటికొచ్చిన వదిన మరుదులకు అమ్మ తర్వాత అమ్మవుతుంది. అమ్మ చూపించే ఆప్యాయతలు వదిన అందిస్తుంది. మరుదులను వదిన కన్న కొడుకుకన్నా మిన్నగా చూసుకుంటుంది. కనిపెంచకున్నా వెన్నెలాంటి మనసుతో మమత పంచుతుంది. మరుదులు చిన్నవారయితే చిటికెను వేలు పట్టి మరీ ముందుకు నడిపిస్తుంది. అన్నదమ్ముళ్ల మధ్య వచ్చే పొరపొచ్చాలను దూరం చేసి ఏకం చేయడానికి దోహదపడుతుంది. జీవితంలో స్థిరపడేందుకు సహాయ సహకారాలు అందిస్తుంది. అరమరికలు లేకుండా అన్నదమ్ములు పాలు, నీళ్లలా కలిసిపోయి ఉండాలని విషయాన్ని అంతర్లీనంగా చెప్తూ ఈ విషయంలో వారికి మార్గదర్శి అవుతుంది. బతుకు సమరం సాగించేందుకు దిక్సూచిగా నిలుస్తుంది. వదిన స్థానమూ కుటుంబంలో అత్యంత ప్రధానమే. -
త్రీడీ సినిమాలా స్త్రీ జీవితం
చెన్నై, సాక్షి ప్రతినిధి: నేటి సమాజంలో స్త్రీ జీవితం త్రీడీ సినిమాలా తయారైందని ఓ మహిళ అభిప్రాయపడ్డారు. చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలకు రక్షణ కరువైందని మరో మహిళ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు కాదు వ్యక్తుల ఆలోచన ధోరణిలో మార్పురావాలని మరో వనిత అభిప్రాయపడ్డారు. ఆలిండియా రేడియో (చెన్నై), ఆంధ్ర మహిళా సభ సంయుక్తంగా మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా వారోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై బుధవారం ‘వనితావాణి’ పేరుతో మహిళా అభిప్రాయ వేదికను నిర్వహించారు. సుమారు 20 అంశాలను నిర్వాహకులు సభ ముందుంచారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు, గృహిణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెళ్లంటే నూరేళ్ల పంట అనే నానుడి కాలక్రమేణా సంవత్సరాలు, నెలలు, రోజులకు దిగజారిపోయిందని లావణ్య పేర్కొన్నారు. పెళ్లివేడుకల్లో హంగులు హడావుడికేగానీ అందులోని అంతరార్థానికి తావులేకుండా పోయిందన్నారు. అందువల్లనే డొమెస్టిక్ వయలెన్స్, డౌరీ హరాస్మెంట్, డైవర్స్ అనే త్రీడీ సినిమాగా మహిళ జీవితం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ వసంత మాట్లాడుతూ ప్రతి స్త్రీకి ఓర్పు, సహనం, క్షమాగుణం, మనో ధైర్యం వంటి అవసరమని పేర్కొన్నారు. పెళ్లినాటికే విలాసవంతమైన జీవితాన్ని ఆశించడం వల్ల అనేక కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయని శారద అన్నారు. సర్దుబాటు, నమ్మకం, అర్థం చేసుకోవడం ద్వారా కాపురాలను కాపాడుకోవచ్చన్నారు. ఇంటినే కాదు పర్యావరణ పరిక్షణలోనూ స్త్రీపాత్ర ఉందని మాజేటి జయశ్రీ గుర్తుచేశారు. సంసార పరంగా వివిధ బాధ్యతలు నిర్వర్తించే స్త్రీమూర్తి ముందుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నపుడే భర్త, పిల్లలకు న్యాయం చేయగలుగుతుందని జానకి పేర్కొన్నారు. డైటింగ్ పేరుతో గృహిణి కడుపు మాడ్చుకోరాదని, పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని స్వీకరించాలని శ్యామల పేర్కొన్నారు. పెళ్లిళ్లలో పండితులు చదివే మంత్రాల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని పట్టించుకోవడం మానివేశారని, కాపురాల విచ్ఛిన్నానికి ఇది ప్రధాన కారణమని కనకదుర్గ అన్నారు. మహిళాదినోత్సవాలు ఎలా ప్రారంభమయ్యూయో బోడపాటి కృష్ణవేణి వివరించారు. ఉప్పులూరి విజయలక్ష్మి మాట్లాడుతూ, ఆనందం అనేది ఒక మానసిక స్థితి, ఇష్టమైన పనులను ఆచరిస్తే అనందం అందరి సొంతమని అన్నారు. సభాధ్యక్షురాలు శ్రీమతి రామనాథన్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన లెక్కల ప్రకారం మహిళలపై ప్రతి 26 నిమిషాలకు ఒక వికృత చేష్ట, 34 నిమిషాలకు అత్యాచారం, 43 నిమిషాలకు కిడ్నాప్, 93 నిమిషాలకు హత్య, 102 నిమిషాలకు రేప్డెత్ నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1991-71 మధ్యకాలంలో వరకట్న చావులు 71 శాతానికి చేరుకున్నాయని ఆవేదన చెందారు. కార్యక్రమం మధ్యలో శారద, జయంతి, అముక్తమాల్యద, ఉమ, సింధూరీ, వసుంధర పాటలను ఆలపించారు. ఆస్కా అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి, ఆలిండియా రేడియో ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నాగసూరి వేణుగోపాల్, వ్యాఖ్యాత గజ గౌరీ, ఆంధ్రమహిళా సభ మాజీ అధ్యక్షురాలు అక్కమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు జ్ఞాపికలను అందజేశారు.