లక్ష్యసాధనకు ఏకాగ్రతే ముఖ్యం | Personality development classes in vavilavalasa | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనకు ఏకాగ్రతే ముఖ్యం

Feb 1 2018 12:30 PM | Updated on Feb 1 2018 12:30 PM

Personality development classes in vavilavalasa - Sakshi

మాట్లాడుతున్న యండమూరి ,పాల్గొన్న విద్యార్థులు

శ్రీకాకుళం, రేగిడి: లక్ష్య సాధనలో ఏకాగ్రతే ముఖ్యమని, దీనివల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్‌ తెలిపారు. కొన్ని అంశాలను విద్యార్థులు నిరంతరం సాధన చేయాలని సూచించారు. జ్ఞాపకశక్తి పెంచుకునేలా చదవాలి తప్ప బట్టీ విధానం మానుకోవాలని హితబోధ చేశారు. మండల పరిధిలోని వావిలవలసలో ఏఎంఆర్‌ గ్రూపు చైర్మన్‌ ముయిద ఆనందరావు పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ప్రతి విషయం నేర్చుకోవడం, దానిని పదే పదే మననం చేసుకొని తద్వారా మేధాశక్తికి మరింత పదునుపెట్టడం వంటి అంశాలను విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా ఒక అంశాన్ని అనర్గళంగా నేర్చుకున్నప్పుడే ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకుండా పాఠశాలలో పూర్తిసమయాన్ని చదువుపై కేంద్రీకరించాలని, అప్పుడే లక్ష్యం సాధించగలుగుతారని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్లపైనే ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో చదువులో వెనుకబడుతున్నారని, విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్షణాలను అలవర్చుకుంటే భవిష్యత్‌ బంగారుమయమవుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. రేగిడి, రాజాం, సంతకవిటి మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నవారంతా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. పుట్టినరోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేసిన ఆనందరావును యండమూరితో పాటు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజాంకు చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణులు వారాడ వంశీకృష్ణ, మజ్జి మదన్‌మోహన్, ఎస్‌.సత్యనారాయణ, కొత్తా సాయి ప్రశాంత్‌ కుమార్, ముయిద శ్రీనివాసరావు, ముళ్లపూడి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement