‘నాయకత్వం: 21వ శతాబ్దం’ కోర్సులో చేరిన ముఖ్యమంత్రి
ఈ నెల 25 నుంచి 30 మధ్య తరగతులకు హాజరు
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నిర్వహించే ‘నాయకత్వం: 21వ శతాబ్దం’ అనే కోర్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశం పొందారు. మసాచ్యూసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న కెన్నడీ స్కూల్ క్యాంపస్‌లో ఈ నెల 25 నుంచి 30 వరకు జరగనున్న తరగతి గది విద్యాబోధనకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు.
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఘర్షణలు, వాటిని ఎదుర్కోవడంలో అవసరమైన అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు. అమెరికాలోని అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీ (ఐవీ లీగ్)ల్లో ఒకటైన హార్వర్డ్‌లో ప్రవేశం పొందిన స్వతంత్ర భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐదు ఖండాల పరిధిలోని 20 దేశాల నుంచి అభ్యర్థులు ఈ కోర్సులో చేరినట్లు తెలిపింది.
సీఎం రేవంత్ తరగతులకు హాజరై అసైన్‌మెంట్లు, హోమ్వర్క్తోపాటు సహ విద్యార్థులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. ప్రొఫెసర్ టిమ్ ఓబ్రియన్ ఈ కోర్సుకు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ కరెన్ మొరిస్సే కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలు, వేర్వేరు సమయాలకు సంబంధించిన చరిత్రను కోర్సులో భాగంగా విశ్లేషించనున్నారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలను విద్యార్థుల గ్రూపులకు సూచించనున్నారు. కోర్సు పూర్తయ్యాక సీఎం రేవంత్ హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.


