
చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మిని పరామర్శిస్తున్న అధికారులు
శ్రీకాకుళం , లావేరు: మండలంలోని తాళ్లవలస అంగన్‌వాడీ కేంద్రంలో పెనుప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా కుక్కర్ పేలడంతో కార్యకర్తకు గాయాలయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం అంగన్‌వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి కుక్కర్‌లో పప్పు వండుతుండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కార్యకర్త మొహంతో పాటు మరికొన్ని చోట్ల కాలిపోయింది. వెంటనే ఆమెను గ్రామస్తులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
కుక్కర్ పేలిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ..కేంద్రానికి పరుగున వచ్చారు. అయితే పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు ముప్పిడి సురేష్, రణస్థలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పీవో కె.రూపవతి, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు జి.ఝూన్సీ, పి.కరుణశ్రీ.. అంగన్‌వాడీ కార్యకర్త వెంకటలక్ష్మిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు.