
చిన్నారుల ఆరోగ్యంతో కూటమి సర్కారు చెలగాటం..!
అంగన్‌వాడీ సెంటర్లకు ‘మెడికల్ కిట్స్’లో నామినేషన్ కిటుకు
కేరళ కండోమ్ తయారీ కంపెనీకి రూ.7.31 కోట్ల వర్క్ ఆర్డర్
డైరెక్టర్ ముస్సోరి శిక్షణకు వెళ్లడమే అదనుగా నిబంధనలకు తూట్లు
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో చక్రం తిప్పిన కీలక అధికారి
టెండర్ లేకుండా ఆగమేఘాలపై నామినేషన్ పద్ధతికి కుదిరిన డీల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కారు అభంశుభం తెలియని చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఎమర్జెన్సీ మెడికల్ కిట్ల పంపిణీలోనూ చేతివాటం ప్రదర్శించింది. 2025–26 సంవత్సరానికి టెండర్ పిలవకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.7,31,54,361 విలువైన వర్క్ ఆర్డర్‌ను నామినేషన్ పద్ధతిపై అప్పగించేసింది.
కేరళకు చెందిన మూడ్స్ కండోమ్స్ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అడ్డగోలుగా నామినేషన్‌పై అప్పగించడంలో తెరవెనుక డీల్ కుదిరింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 257 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్) ప్రాజెక్ట్‌ల పరిధిలో 55,746 అంగన్‌వాడీ సెంటర్‌లలో ఉండే చిన్నారుల ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) కోసం అందించే మెడికల్ కిట్లలోనూ కక్కుర్తి పడటం అత్యంత దారుణమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
నిబంధనలకు పాతర..
వాస్తవానికి వైద్యపరంగా అత్యవసరమైతేనే నామినేషన్ పద్ధతిలో వర్క్ ఆర్డర్ ఇస్తారు. సాధారణ సందర్భాల్లో రూ.లక్ష వర్క్ ఆర్డర్ ఇవ్వాలన్నా టెండర్ పిలవాలనే నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన మెడికల్ కిట్ల సరఫరాకు నామినేషన్ పద్ధతిపై ఈ నెల 5న వర్క్ ఆర్డర్ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది తేటతెల్లమవుతోంది.
అది కూడా అందుబాటులో ఉన్న పెరెన్నికగన్న కంపెనీలను కాదని ఎక్కడో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ కంపెనీకి నామినేషన్ పద్ధతిపై అప్పగించడం గమనార్హం. ఆ కంపెనీ మూడ్స్ కండోమ్స్, గర్భ నిరోధక, రుతుక్రమం పరిశుభ్రత వస్తువులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది.
పొరుగు రాష్ట్రానికి చెందిన కంపెనీకి నామినేషన్ పద్ధతిపై వర్క్ ఆర్డర్ అప్పగించడంతో 10శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లింపు, సక్రమంగా మెడికల్ కిట్‌ల పంపిణీలో ఎంత మేరకు బాధ్యత ఉంటుందన్నది అనుమానమే. దీనికితోడు నిజంగా కేరళ నుంచి మెడికల్ కిట్‌లు కొనుగోలు చేసి ఏపీకి అందిస్తే స్థానికంగా మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీని కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కో మెడికల్ కిట్ ధర రూ.1312.25 చొప్పున నిర్ణయించగా స్థానిక మార్కెట్‌లో దానిలో కనీసం 30 శాతం నుంచి 40 శాతం తక్కువ ధరకు లభిస్తుందని చెబుతున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్‌ల పంపిణీ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్ పిలిచి అపోలో, మెడ్‌ప్లస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా మెడికల్ కిట్‌లు సరఫరా చేసేవారు. అందుకు భిన్నంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిపై కేరళ కంపెనీకి కట్టబెట్టడం శోచనీయం.
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో చక్రం తిప్పిన అధికారి..
రూ.7.31 కోట్లకుపైగా వర్క్ ఆర్డర్‌ను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టిన తంతులో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో కీలక అధికారి ఒకరు చక్రం తిప్పినట్టు తెల్సింది. గత టీడీపీ పాలనలో మంత్రి లోకేశ్ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిపించారన్న విమర్శలు ఎదుర్కొన్న అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సమాచారం.
వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లోనే అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్‌ల పంపిణీ ప్రతిపాదన వచ్చింది. అంత పెద్ద మొత్తంలో నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం సరికాదని, టెండర్ పిలవాల్సిందేనని ఐసీడీఎస్ డైరెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. కొరకరాని కొయ్యగా మారిన ఆయన ఇటీవల నెల రోజులపాటు ముస్సోరీ శిక్షణకు వెళ్లారు. అదే అదనుగా కీలక అధికారి ఒకరు ఈ డీల్ సెట్ చేసినట్టు విశ్వసనీయంగా తెల్సింది.