నా చెత్త బ్యాటింగ్‌కు కారణం అదే: యువీ

Yuvraj Singh Speaks About Mumbai Indians - Sakshi

సాక్షి, ముంబై: ఐపీఎల్‌ వేలంలో జరిగిన పరిణామాలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో మొదటి రౌండ్‌లో యువీని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రౌండ్‌లో అతడి ప్రాథమిక ధర రూ.కోటికే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. దీనిపై యువీ స్పందిస్తూ.. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఆడతానని ముందే ఊహించానని, అదిప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.

‘ముంబై తరపున ఆడతానని ఎక్కడో ఒకచోట అనిపించేంది. నిజం చెప్పాలంటే ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడే అవకాశం రావాలి కోరుకున్నాను. అనుకున్నది జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఆకాశ్‌(అంబానీ) నా గురించి కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ సీజన్‌లో అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాన’ని యువరాజ్‌ ‘ముంబై మిర్రర్‌​’తో చెప్పాడు.

గత సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరపున తాను రాణించలేకపోయానని అతడు ఒప్పుకున్నాడు. ఒకే స్థానంలో బ్యాటింగ్‌కు పంపకపోవడమే తన వైఫల్యానికి కారణమని వెల్లడించాడు. తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగినట్టు గుర్తు చేశాడు. తన క్రీడాజీవితం తుదిదశలో ఉన్నందున ఐపీఎల్‌ వేలంలో మొదటి రౌండ్‌లోనే తనను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదని అంగీకరించాడు. ‘ఐపీఎల్‌ జట్టు కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఫ్రాంచైజీలు ఎక్కువగా యువకులపై దృష్టి పెడతాయి. అటువంటి దశలో నాకు కూడా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నా కెరీర్‌ చివరి దశలో ఉంది. కనీసం చివరి రౌండ్‌లోనైనా నన్ను వేలంలో దక్కించుకుంటారన్న నా ఆశ నిజమైంద’ని యువరాజ్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top