కెరీర్‌లో తొలిసారి... | Yuki Bhambri enters Citi Open quarters in career-best show | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో తొలిసారి...

Aug 5 2017 12:22 AM | Updated on Sep 17 2017 5:10 PM

కెరీర్‌లో తొలిసారి...

కెరీర్‌లో తొలిసారి...

మరో అద్భుత విజయంతో భారత టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ సిటీ ఓపెన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఏటీపీ–500 టోర్నీ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ

వాషింగ్టన్‌: మరో అద్భుత విజయంతో భారత టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ సిటీ ఓపెన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 200వ ర్యాంకర్‌ యూకీ 6–7 (5/7), 6–3, 6–1తో ప్రపంచ 100వ ర్యాంకర్‌ గిడో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచాడు. ఈ గెలుపుతో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యూకీ తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ–500 పాయింట్ల టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఏటీపీ సర్క్యూట్‌లో ప్రైజ్‌మనీ, పాయింట్ల పరంగా టోర్నీలను ఐదు స్థాయిలుగా (గ్రాండ్‌స్లామ్స్‌ (2000 పాయింట్లు), వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (1500 పాయింట్లు), వరల్డ్‌ టూర్‌ మాస్టర్స్‌ సిరీస్‌ (1000 పాయింట్లు), ఏటీపీ–500, ఏటీపీ–250 పాయింట్లు) విభజిస్తారు.

ఇందులో సిటీ ఓపెన్‌ నాలుగోస్థాయి టోర్నీ. అంతేకాకుండా ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌ టోర్నీలో యూకీ వరుసగా మూడు విజయాలు నమోదు చేయడం... చెన్నై ఓపెన్‌ (2014లో) తర్వాత ఓ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ టోర్నీలో యూకీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. పెల్లాతో రెండు గంటల తొమ్మిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాక ఒక్కసారిగా విజృంభించి వరుసగా రెండు సెట్‌లు గెల్చుకున్నాడు. రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, 22వ ర్యాంకర్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై యూకీ సంచలన విజయం సాధించిన సంగతి విదితమే. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 45వ ర్యాంకర్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)తో యూకీ ఆడతాడు.

మరోవైపు ఇదే టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా (భారత్‌)–మోనికా నికెలెస్క్యూ (రొమేనియా) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో సానియా–మోనికా ద్వయం 6–3, 6–2తో జేమీ లోబ్‌–యాష్లే వీన్‌హోల్డ్‌ (అమెరికా) జోడీపై గెలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement