పోరాడి ఓడిన సింధు | Yamaguchi beats pv sindhu | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సింధు

Dec 17 2017 5:31 PM | Updated on Dec 17 2017 9:47 PM

Yamaguchi beats pv sindhu - Sakshi

దుబాయ్‌: వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు  21-15, 12-21, 19-21 తేడాతో యామగుచి(జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను పెద్దగా కష్టపడకుండా గెలిచిన సింధు.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టైటిల్‌ వేటలో నిరాశ పరిచింది.


మొదటి గేమ్‌లో యామగుచి వరుస నాలుగు పాయింట్లు సాధించిన సమయంలో సింధు తిరిగి తేరుకుంది. సింధు 3-5తో వెనుకబడిన దశలో వరుసగా పాయింట్ల సాధించి స్కోరును 5-5తో సమం చేసింది.ఆపై అదే జోరును కొనసాగించి 11-8, 13-9 పాయింట్ల తేడాతో ముందుకు దూసుకుపోయింది. సింధు 15-13తో ఆధిక్యంలో ఉన్న దశలోవరుసగా నాలుగు పాయింట్లను సాధించి 19-13తో యామగుచిని మరింత వెనక్కినెట్టింది.. అటు తరువాత యామగుచికి రెండు పాయింట్లను మాత్రమే కోల్పోయిన సింధు 21-15తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక రెండో గేమ్‌లో సింధు 5-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి సత్తాచాటింది. ప్రధానంగా రెండో గేమ్‌ సగం వరకూ సింధు ఆధిక్యం కొనసాగినప్పటికీ ఆపై యామగుచి విజృంభించింది. సుదీర్ఘమైన ర్యాలీలతో సింధుకు పరీక్ష పెట్టడంతో పాటు అద్బుతమైన స్మాష్‌లతో చెలరేగి ఆడింది. ఈ క్రమంలోనే యామగుచి 11-9, 13-11 తో ఆధిక్యాన్నిసాధించింది. అదే ఊపును కడవరకూ సాగించిన యామగుచి 21-12తో ఆ గేమ్‌ను దక్కించుకుంది.

ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. సింధు వరుసగా నాలుగు పాయింట్లు 4-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి మూడు పాయింట్లు సాధించింది. ఫలితంగా సింధు ఆధిక్యం 4-3కు తగ్గింది. అటు తరువాత 5-5, 6-6తో ఇద్దరూ సమంగా నిలిచిన దశలో సింధు స్మాష్‌లతో ఆకట్టుకుంది. ఫలితంగా సింధు 11-8తో పైచేయి సాధించింది. కాగా, అప్పుడే అసలు సిసలైన సమరం మొదలైంది. ప్రతీ పాయింట్‌ కోసం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కాగా, చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఆఖరి గేమ్‌లో యామగుచి 21-19తేడాతో గేమ్‌ను దక్కించుకోవడంతో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement