ఆ ప్రశ్న  ఇక అడగరేమో!

World Tour Finals Success is special with me - Sakshi

పక్కా ప్రణాళిక... సరైన వ్యూహాలు... చెక్కు చెదరని ఏకాగ్రత... కీలక దశలో ఒత్తిడికి లోనుకాకుండా దృఢచిత్తంతో ఉండటం... వెరసి ఈ సీజన్‌లో తనకు లోటుగా ఉన్న అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ అందడంలో ముఖ్యపాత్ర పోషించాయని పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన అనంతరం చైనాలోని గ్వాంగ్‌జౌ నుంచి సింధు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. కెరీర్‌లోని గొప్ప విజయంపై వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... 

ప్రత్యేక వ్యూహాలు... 
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు ముందు భారత్‌లో జరిగిన సయ్యద్‌ మోదీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగకపోవడం మేలు చేసింది. ఆ సమయాన్ని నేను ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు వినియోగించుకున్నాను. ఈ ఏడాది నాకు ఇబ్బంది కలిగించిన, నన్ను ఓడించిన క్రీడాకారిణులు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఐదుగురికి ఐదు ప్రత్యేక వ్యూహాలు రచించాం. మ్యాచ్‌ల్లో వాటిని అమలుచేసి అనుకున్న ఫలితాన్ని సాధించాం. 

ఎంతో ప్రత్యేకం..
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ ఏడాది నేను సాధించిన తొలి టైటిల్‌ ఇదే కావడం... వరుస ఫైనల్స్‌ పరాజయాలకు బ్రేక్‌ పడటంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కొంతకాలంగా ఎక్కడి వెళ్లినా తరచూ ఫైనల్స్‌లో ఓడిపోతున్నావెందుకు అనే ప్రశ్న ఎదురైంది. ఇక మీదట నాకు అలాంటి ప్రశ్న మళ్లీ ఎదురుకాదేమోనని భావిస్తున్నాను. గతేడాది ఇదే టోర్నీ ఫైనల్స్‌లో విజయం అంచుల్లో నిలిచి ఓడిపోయాక ఎంతో బాధపడ్డాను. ఈసారి మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
 
తేలిగ్గా తీసుకోలేదు... 
జపాన్‌ క్రీడాకారిణులు ఒకుహారా, యామగుచిలతో ఆడే మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగుతాయి. ఎక్కువగా ర్యాలీలు ఉంటాయి. ఈసారీ అదే జరిగింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయాన్ని అందుకున్నాను. ఈ టోర్నీలో ఎవరినీ తేలిగ్గా తీసుకోలేదు.  

తదుపరి లక్ష్యం 
ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌... 
ఈ విజయంతో సింధు మదిలో నుంచి ఫైనల్లో ఓడిపోతున్నాననే అంశం వెళ్లిపోతుందని అనుకుంటున్నా. టోర్నీ మొత్తం సింధు ఆటతీరు అద్భుతంగా ఉంది. ఎంతో నాణ్యమైన క్రీడాకారిణులపై ఆమె గెలిచింది. వచ్చే ఏడాది మా ప్రధాన లక్ష్యం ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడమే. 2001లో నేను టైటిల్‌ సాధించాక భారత్‌ నుంచి మరో ప్లేయర్‌కు ఈ టైటిల్‌ లభించలేదు. వచ్చే ఏడాది ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నాం. అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్, 2022 కామన్వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించడం మా భవిష్యత్‌ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. 
– పుల్లెల గోపీచంద్, భారత చీఫ్‌ కోచ్‌ 

‘సిల్వర్‌ సింధు’ కాదు... 
సింధు విజయం అద్భుతం. ఏడాది చివరికొచ్చేసరికి ‘సిల్వర్‌ సింధు’ కాదు భారత బ్యాడ్మింటన్‌ ‘గోల్డెన్‌ గర్ల్‌’ అని తన గెలుపుతో సింధు నిరూపించింది. ఈసారి టైటిల్‌తో తిరిగొస్తాననే విశ్వాసంతో ఆమె వెళ్లింది. తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్‌ ఉన్న క్రీడాకారిణులను ఓడించింది. సింధు ప్రదర్శనపట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. అన్ని మ్యాచ్‌లను సింధు ఎంతో ఓపికతో, పక్కా ప్రణాళికతో ఆడింది. కొత్త చరిత్రను లిఖించింది. 
– పీవీ రమణ (సింధు తండ్రి) 

ప్రశంసల వెల్లువ... 
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ విజేత పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె విజయాన్ని కొనియాడారు. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు సింధుకు అభినందనలు తెలిపారు.   

‘బాయ్‌’ నజరానా రూ. 10 లక్షలు 
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ గెలిచిన పీవీ సింధును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అభినందించింది. విజేతగా నిలిచిన సింధుకు రూ. 10 లక్షల నగదు పురస్కారం... పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సమీర్‌ వర్మకు రూ. 3 లక్షలు అందజేయనున్నట్లు ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top