అంకుర్‌ గురి అదరహో 

World shooting championship: Ankur Mittal hits gold in double trap - Sakshi

డబుల్‌ ట్రాప్‌లో స్వర్ణం నెగ్గిన 

భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌

చాంగ్‌వాన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో అంకుర్‌ మిట్టల్‌ పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకం, టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యంతో సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో అంకుర్‌ మిట్టల్, ఇయాంగ్‌ యంగ్‌ (చైనా) 140 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. అయితే షూట్‌ ఆఫ్‌లో అంకుర్‌ 4 పాయింట్లు... ఇయాంగ్‌ యంగ్‌ 3 పాయింట్లు సాధించారు. దాంతో అంకుర్‌కు స్వర్ణం... ఇయాంగ్‌ యంగ్‌కు రజతం ఖాయ మయ్యాయి. అండ్రెజ్‌ (స్లొవేకియా) కాంస్య పతకం గెలిచాడు. టీమ్‌ ఈవెంట్‌లో అంకుర్, అసబ్, శార్దూల్‌లతో కూడిన భారత జట్టు 409 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. ఇటలీ జట్టుకు (411) స్వర్ణం, చైనా బృందం (410) రజతం గెలుపొందాయి.  

మరోవైపు ఇద్దరు భారత మహిళా షూటర్లు త్రుటిలో ఫైనల్‌ అర్హత కోల్పోయారు. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో రజతం నెగ్గిన అంజుమ్‌ మౌద్గిల్‌... 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మహిళల 25 మీ. పిస్టల్‌ ఈవెంట్‌లో మను భాకర్‌ పదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పటి వరకు భారత్‌ 20 పతకాలు సాధించగా, ఇందులో ఏడు చొప్పున స్వర్ణాలు, రజతాలు, ఆరు కాంస్య పతకాలున్నాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top