తడబడి నిలబడిన ఆసీస్‌

World Cup 2019 Australia Set 289 Runs Target To West Indies - Sakshi

నాటింగ్‌హామ్ ‌: ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ ఆటగాళ్లలో కౌల్టర్‌ నైల్‌(92; 60 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవ్‌ స్మిత్‌(73; 103 బంతుల్లో 7ఫోర్లు), కేరీ(45) మినహా అందరూ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆసీస్‌ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కరేబియన్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. థామస్‌, కాట్రెల్, రసెల్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి విండీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. తమ కెప్టెన్‌ నిర్ణయం సరైనదేనని చాటుతూ.. ఆరంభం నుంచి ఆ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. పదునైన విండీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి ఫించ్‌(6)తో సహా వార్నర్‌(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్‌(0), స్టొయినిస్‌(19)లు పూర్తిగా విఫలమవ్వడంతో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

స్మిత్‌ రాణించగా.. కౌల్టర్ నైల్‌ రెచ్చిపోగా
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్టీవ్‌ స్మిత్‌. ఆరో వికెట్‌కు అలెక్స్ కేరీ(45)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. కేరీ ఔటైన అనంతరం కౌల్టర్‌ నైల్‌ క్రీజులోకి రావడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కౌల్టర్‌ నైల్‌.. విండీస్‌ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కౌల్టర్‌ నైల్‌ ఊపు చూసి గేర్‌ మార్చిన స్మిత్‌ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పెంచాడు.  వీరిద్దరూ ఏడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంరతం స్మిత్‌ను ఔట్‌ చేసి ఈ జోడిని థామస్‌ విడదీస్తాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న కౌల్టర్‌ నైల్‌ పయనం 92 పరుగుల వద్దే ముగుస్తుంది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top