ఇంగ్లండ్‌ జిగేల్‌

World Cup 2018: England fans delight at reaching semi-finals - Sakshi

స్వీడన్‌పై 2–0తో గెలుపు

28 ఏళ్ల తర్వాత సెమీస్‌కు...

ఫేవరెట్‌గా బరిలో దిగిన సందర్భాల్లోనూ... డేవిడ్‌ బెక్‌హామ్, వేన్‌ రూనీల హయాంలోనూ సాధ్యం కాని దానిని... యువ హ్యారీ కేన్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ సాధించింది. తమకు మింగుడు పడని ప్రత్యర్థి అయిన స్వీడన్‌ను క్వార్టర్‌ ఫైనల్లో అలవోకగా ఓడించింది. మొదటి భాగం, రెండో భాగంలో ‘తల’మానికమైన గోల్స్‌తో 1990 తర్వాత తొలిసారి ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.   

సమారా: ఇప్పటివరకు వేర్వేరు టోర్నీల్లో 24 సార్లు స్వీడన్‌తో తలపడిన ఇంగ్లండ్‌ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడింది. 9 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ఈ గణాంకాలు చాలు... వీటి మధ్య చిరకాల పోరాట తీవ్రతను చాటేందుకు. ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో రెండు జట్లు ఎదురుపడటంతో అందరూ మరోసారి పోటాపోటీ తప్పదనుకున్నారు. కానీ, ఇంగ్లండ్‌ దాడి ముందు స్వీడన్‌ నిలవలేకపోయింది. కనీస ప్రతిఘటన చూపలేక చేతులెత్తేసింది. హ్యారీ మగ్యురె (30 నిమిషం), డెలె అల్లీ (59వ ని.)ల హెడర్‌ గోల్స్‌తో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2–0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 1990 తర్వాత ఇంగ్లండ్‌ జట్టు సెమీస్‌ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

స్వీడన్‌ పొడిచేస్తుందనుకుంటే! 
ఓపికగా ఆడి పట్టు సాధించే ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో అదే వ్యూహం మేరకు ఫలితం పొందగా, రక్షణాత్మక శైలితో దాడులకు దిగే స్వీడన్‌ మాత్రంఎవరూ ఊహించని  పేలవ ప్రదర్శనతో లొంగిపోయింది. రెండు జట్లు పట్టుదలగా ఆడటంతో మ్యాచ్‌ సమంగానే ప్రారంభమైంది. అప్పటికీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్‌ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. అయితే, 30వ నిమిషంలో ఎడమ వైపు నుంచి ఆష్లి యంగ్‌ కొట్టిన లాఫ్టెడ్‌ కార్నర్‌ను ఆటగాళ్లందరి మధ్యలో అందుకున్న డిఫెండర్‌ మగ్యురె... హెడర్‌తో నెట్‌లోకి పంపి స్కోరు చేశాడు. రహీమ్‌ స్టెర్లింగ్, కీరన్‌ ట్రిప్పర్‌ల సమన్వయంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. అంతకుముందు స్టెర్లింగ్‌కే రెండు గోల్‌ అవకాశాలు వచ్చినా అవి లక్ష్యం చేరలేదు. మొదటి భాగంలో చిన్న పొరపాట్లతో వెనుకంజ వేసిన స్వీడన్‌... రెండోభాగంలో ప్రభావవంతంగా ఆడే తమ లక్షణాన్ని కూడా ప్రదర్శించలేదు.  
స్ట్రయికర్‌ మార్కస్‌ బెర్గ్‌ చక్కటి షాట్‌ను డైవ్‌తో అందుకున్న ఇంగ్లండ్‌ కీపర్‌ పిక్‌ఫోర్డ్‌ ఆసాంతం అడ్డుగోడలా నిలిచాడు. ఇంతలోనే ఇంగ్లండ్‌కు రెండో గోల్‌ దక్కింది. బాక్స్‌ నుంచి లిన్‌గార్డ్‌ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న అల్లీ సులువుగా తలతో గోల్‌ పోస్ట్‌లోకి పంపి జట్టును 2–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్‌ ఇంకో 20 నిమిషాలు ఉందనగానే స్వీడన్‌ ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసినట్లు కనిపించారు. ఇదే అదనుగా పట్టు నిలబెట్టుకునేలా ప్రత్యర్థిపై ఇంగ్లండ్‌ దాడులు పెంచింది. స్వీడన్‌ చివర్లో ముగ్గురు సబ్‌స్టిట్యూట్లను దింపినా... ఉపయోగం లేకపోయింది. మ్యాచ్‌ మొత్తంలో స్వీడన్‌ మూడుసార్లు మాత్రమే ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌పై గురి చూసి షాట్‌లు కొట్టింది. రష్యా, క్రొయేషియా జట్ల మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ తలపడుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top