ఒకరి వెంట ఒకరు...

Wimbledon champion Kerber out of US Open - Sakshi

ఒకే రోజు టాప్‌–10లోని నలుగురు సీడెడ్‌ క్రీడాకారిణుల పరాజయం

కెర్బర్, క్విటోవా, గార్సియా, ఒస్టాపెంకో ఔట్‌

న్యూయార్క్‌: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ లో మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌ రావడం ఖాయమైంది. యూఎస్‌ ఓపెన్‌లో ఆదివారం ఒక్కరోజే మహిళల సింగిల్స్‌ టాప్‌–10లోని నలుగురు సీడెడ్‌ క్రీడాకారిణులు ఓడిపోయారు. నాలుగో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన కెర్బర్‌ (జర్మనీ), ఐదో సీడ్‌  క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆరో సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌), పదో సీడ్‌ ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత, రెండో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) రెండో రౌండ్‌లో... ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు.  

మూడో రౌండ్‌లో 29వ సీడ్‌ సిబుల్కోవా (స్లొవేకియా) 3–6, 6–3, 6–3తో కెర్బర్‌పై, 22వ సీడ్‌ షరపోవా (రష్యా) 6–3, 6–2తో ఒస్టాపెంకోపై, 30వ సీడ్‌ కార్లా నవారో (స్పెయిన్‌) 5–7, 6–4, 7–6 (7/4)తో గార్సియాపై, 26వ సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 7–5, 6–1తో క్విటోవాపై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో రౌండ్‌లో నిష్క్రమించగా... రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), ఆరో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. జర్మనీ ప్లేయర్‌ కోల్‌ష్రైబర్‌ 6–7 (1/7), 6–4, 6–1, 6–3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. ఫెడరర్‌ 6–4, 6–1, 7–5తో కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై, జొకోవిచ్‌ 6–2, 6–3, 6–3తో గాస్కే (ఫ్రాన్స్‌)పై గెలిచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top