Sakshi News home page

రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం

Published Tue, Apr 12 2016 11:44 AM

రీసైకిల్ చేసిన నీటినే ఐపీఎల్‌కు వాడుకుంటాం

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అడ్డు తొలగించుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఓ సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. తాము ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేసే నీటినే మ్యాచ్‌లలో పిచ్ సిద్ధం చేయడానికి వాడుకుంటామని బాంబే హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బాంబే హైకోర్టులో సమాధానం దాఖలు చేసింది. వాడిన నీటిని రీసైకిల్ చేసి, ఆ నీళ్లనే ఆర్‌డబ్ల్యుఐటీసీ సరఫరా చేస్తుంది. దానివల్ల తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఎంసీఏ చెప్పింది.

పిచ్‌లను సిద్ధం చేయడానికి వాళ్లు సరఫరా చేసే రీసైకిల్డ్ నీళ్లు సరిపోతాయని ఎంసీఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందువల్ల మంచినీటిని ఉపయోగించకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాగా.. ముంబై, పుణె నగరాల్లో నిర్వహించే 17 మ్యాచ్‌లకు ఈ రీసైకిల్డ్ నీళ్లను ఉపయోగిస్తారు. మరోవైపు నాగపూర్‌లో నిర్వహించదలచిన మూడు మ్యాచ్‌లను మొహాలీకి తరలించేందుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని బీసీసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement