అలా అయితే టీమిండియా టాపర్‌!!

Who Will Be The Semi Final Rivals In ICC World Cup 2019 - Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌తో తలపడిన ఇంగ్లండ్‌ జట్టు జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌లో సగర్వంగా అడుగుపెట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పై విజయంతో టీమిండియా ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి మ్యాచ్‌ ఫలితంతో న్యూజిలాండ్‌ 11 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా కివీస్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం నేపథ్యంలో ఈ మెగాటోర్నీలో నిలవాలంటే పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌లో కనీసం 316 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించాలి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మొదటగా బ్యాటింగ్‌కు దిగాలి. అయితే ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్‌ సెమీస్‌లో అడుపెట్టలేదు.

ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టు సెమీస్‌కు చేరడం లాంఛనమే. ఈ క్రమంలో లీగ్‌ దశ ఆఖరులో సెమీస్‌ ప్రత్యర్థులెవరో తేల్చేందుకు ఆసక్తికర సమీకరణం. 14 పాయింట్లతో ప్రస్తుతం టాపర్‌గా ఉన్న ఆస్ట్రేలియా శనివారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఫామ్‌ ప్రకారం ఆసీస్‌ గెలుస్తుందనుకుంటే 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. శనివారమే జరిగే మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ గెలిచి... దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే 15 పాయింట్లతో టీమిండియా టాపర్‌ అవుతుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మరో సెమీస్‌లో తలపడతాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్, లంకపై భారత్‌ ఓడితే ర్యాంకులు యథాతథంగా ఉంటాయి. ఫైనల్‌ బెర్త్‌ కోసం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, భారత్‌-ఇంగ్లండ్‌ పోటీ పడతాయి. సెమీస్‌లో కోహ్లి సేనకు బలమైన ఇంగ్లండ్‌ ఎదురవకూడదని అనుకుంటే... దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్‌ ఓడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top