
వాషింగ్టన్ సుందర్... ఇతడి ఎంపికే కాదు... పేరు, ఆటతీరూ ప్రత్యేకమే. భాషకు ప్రాధాన్యమిచ్చే తమిళనాడుకు చెందిన వాడైనా ‘వాషింగ్టన్’ అని పేరుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. దీని వెనుకో కథనం ఉంది. అదేంటంటే... వాషింగ్టన్ తండ్రి ఎం.సుందర్ మాజీ లీగ్ క్రికెటర్. పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ అనే మాజీ సైనికుడు అన్ని విధాలా ఆయనకు అండగా నిలిచారు. ఆ పెద్దాయన 1999లో చనిపోయారు. కొన్నాళ్లకే... సుందర్‌కు కొడుకు పుట్టాడు.
తనకు సాయపడిన వ్యక్తిపై గౌరవంతో కుమారుడికి ‘వాషింగ్టన్’ అని పేరు పెట్టుకున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ అండర్–19 జాతీయ జట్టు, తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. సహజంగా ఆఫ్ స్పిన్నర్లు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయి ఉంటారు. ఇతడు మాత్రం ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్. ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో ఈ తరహాలో ఎవరూ లేకపోవడం విశేషం.