సైనా నిష్ర్కమణ | WF Super Series Finals: Saina Nehwal crashes out as Indian challenge ends | Sakshi
Sakshi News home page

సైనా నిష్ర్కమణ

Dec 12 2015 12:13 AM | Updated on Sep 3 2017 1:50 PM

సైనా నిష్ర్కమణ

సైనా నిష్ర్కమణ

బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల పోరాటం లీగ్ దశలోనే ముగిసింది.

 వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ముగిసిన భారత్ పోరు
 దుబాయ్:
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. సెమీఫైనల్ దశకు అర్హత సాధించాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సైనా ఓడిపోగా... శ్రీకాంత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి విజయం రుచి చూడకుండానే వెనుదిరిగాడు. గతేడాది ఇదే టోర్నీలో వీరిద్దరూ సెమీఫైనల్‌కు చేరుకోగా... ఈసారి మాత్రం నిరాశపరిచారు.

 గురువారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించిన సైనా అదే జోరును చివరి మ్యాచ్‌లో కొనసాగించడంలో విఫలమైంది. తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో సైనా 21-16, 18-21, 14-21తో ఓటమి చవిచూసింది. సైనాపై గెలిచినప్పటికీ తాయ్ జు యింగ్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో నొజోమి ఒకుహారా (జపాన్) ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గగా... సైనా, మారిన్, తాయ్ జు యింగ్ ఒక్కో మ్యాచ్ గెలిచారు. అయితే మెరుగైన గేమ్‌ల సగటు ఆధారంగా మారిన్ సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది.

 తాయ్ జు యింగ్‌తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను నెగ్గినప్పటికీ... ఆ తర్వాత ఏకాగ్రత కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పలుమార్లు తాయ్ జు యింగ్ షాట్‌లను సరిగ్గా అంచనా వేయలేకపోయిన సైనా అనవసర తప్పిదాలు కూడా చేసింది. గ్రూప్ ‘బి’ నుంచి యిహాన్ వాంగ్ (చైనా), రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో వరుసగా రెండు పరాజయాలు చవిచూసి గురువారమే నాకౌట్ ఆశలను వదులుకున్న శ్రీకాంత్ శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లోనూ తడబడ్డాడు. చూ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 17-21, 13-21తో ఓడిపోయాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ‘ఎ’ నుంచి చెన్ లాంగ్ (చైనా), జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)... గ్రూప్ ‘బి’ నుంచి కెంటో మొమొటా (జపాన్), అక్సెల్‌సన్ (డెన్మార్క్) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement