సింగిల్స్‌పై దృష్టి పెట్టాలి

we will look stay on Singles, Mahesh Bhupati - Sakshi

భారత టెన్నిస్‌పై మహేశ్‌ భూపతి అభిప్రాయం

కోల్‌కతా: భారత టెన్నిస్‌లో ఇక సింగిల్స్‌పై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం వచ్చిందని డేవిస్‌ కప్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో టెన్నిస్‌ క్రీడ అభివృద్ధికి నైపుణ్యం కలిగిన కనీసం పది మంది వర్ధమాన సింగిల్స్‌ ఆటగాళ్లు భారత్‌కు అవసరమన్నారు. ‘ఇప్పటివరకు గొప్ప విజయాలు డబుల్స్‌ కేటగిరీలోనే సాధ్యమయ్యాయి. కేవలం నలుగురి ద్వారానే ఈ ఘనతలన్నీ భారత్‌ ఖాతాలో చేరాయి. డబుల్స్‌ విభాగంలోనే భారత్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను గెలుచుకుంది. ఇక ఈ విభాగంలో మనం గెలిచే టైటిళ్లు యువ ఆటగాళ్లపై అంతగా ప్రభావం చూపలేవు. ఇది మారాలి. సింగిల్స్‌పై దృష్టి పెట్టాలి. పెద్ద టోర్నీల్లో నిలకడగా విజయాలు సాధించే సింగిల్స్‌ ఆటగాళ్లు భారత్‌ నుంచి రావాలి.  

టాప్‌–100లో కనీసం 10 మంది యువ ఆటగాళ్లు చోటు దక్కించుకునే పరిస్థితులు కల్పిస్తేనే భవిష్యత్‌లో భారత టెన్నిస్‌ బాగుంటుంది’ అని తన కెరీర్‌లో 12 టైటిళ్లను గెలుచుకున్న భూపతి ఆకాంక్షించారు. భారత్‌ తరఫున పేస్‌ 18 డబుల్స్‌ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా, భూపతి రెండోస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత్‌ సింగిల్స్‌ నెం.1 ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 109వ స్థానంలో ఉండగా, రామ్‌కుమార్‌ రామనాథన్‌ 131వ ర్యాంకులో ఉన్నాడు. మహిళల విభాగంలో గతవారం సింగపూర్‌ టైటిల్‌ గెలిచిన అంకిత రైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 168వ స్థానంలో, కర్మన్‌కౌర్‌ థండి 205వ స్థానంలో నిలిచారు. ఈ పరిస్థితిపై భూపతి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు తన మాజీ భాగస్వామి, వెటరన్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్‌ని భూపతి ప్రశంసించారు. పేస్‌లో ఇంకా గెలవాలనే కసి, తపన ఉన్నాయని, టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్‌లోనూ పేస్‌ పాల్గొని చరిత్ర సృష్టిస్తాడని అన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top