కోహ్లిని కాదని.. పాక్‌ కెప్టెన్‌కు ఓటేశాడు! | Sakshi
Sakshi News home page

కోహ్లిని కాదని.. పాక్‌ కెప్టెన్‌కు ఓటేశాడు!

Published Mon, Nov 27 2017 4:15 PM

VVS Laxman snubs Virat Kohli while picking best ODI captain of 2017, opts for Sarfraz Ahmed - Sakshi - Sakshi - Sakshi - Sakshi

నాగ్‌పూర్‌:ఇటీవల కాలంలో టీమిండియా విజయాల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  పాత్ర వెలకట్టలేనిది. అటు కెప్టెన్‌గా, ఇటు బ‍్యాట్స్‌మన్‌గా కోహ్లి దూసుకుపోతున్నాడు. తన దూకుడైన ఆట తీరుతో క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలైన మజాను అందిస్తున్నాడు.  ఈ క‍్రమంలోనే ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా కోహ్లి గుర్తింపు సాధించాడు. అయితే ఈ ఏడాది జూన్‌లో లండన్‌లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ సాధించకపోవడం కోహ్లి నాయకత్వ ప్రతిష్టకు భంగం కల్గించిందనే చెప్పాలి. ఈ టోర్నీ తుదిపోరులో పాకిస్తాన్‌ చేతిలో పరాజయం చెందడం భారత అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. తాజాగా ఇదే అభిప్రాయాన‍్ని వ్యక్తం చేసిన భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌.. 2017 అత్యుత్తమ వన్డే కెప్టెన్‌ గా పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ను ఎంచుకున్నాడు.

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో భాగంగా సోమవారం నాల్గో రోజు ఆట మధ్యలో లక్ష్మణ్‌, మాథ్యూ హేడెన్‌, ఆర్నాల్డ్‌ లు ఓ చాట్ షోలో పాల్గొన‍్నారు. ఇక్కడ నాలుగు జట్ల కెప్టెన్ల పేర్లు ఇచ‍్చి అందులో ఈ ఏడాది  అత్యుత్తమ కెప్టెన్‌ ను  ఎంచుకోవాల్సిందిగా కోరారు. అందులో కోహ్లి(భారత్‌), సర్పరాజ్‌ అహ్మద్‌(పాకిస్తాన్‌), ఇయాన్‌ మోర్గాన్‌(ఇంగ్లండ్‌),ఏబీ డివిలియర్స్‌(దక్షిణాఫ్రికా)లు ఆప్షన్‌లుగా సదరు ప్యానెల్‌ ఆ ముగ్గురు దిగ్గజాల ముందుంచింది. అయితే ఇక్కడ కోహ్లిని హేడెన్‌ ఎన్నుకోగా, సర్పరాజ్‌ను ఆర్నాల్డ్‌ ఎంచుకున్నాడు. దాంతో లక్ష్మణ​ వేసే నిర్ణయాత్మక ఓటుకు ప్రాధాన్యత పెరిగింది. కాగా,   సర్పరాజ్‌కే లక్ష్మణ్‌ ఓటేయడంతో పలువురు భారత అభిమానులతోపాటు సహ వ్యాఖ్యాతలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే తాను సర్పరాజ్‌కు ఎందుకు ఓటేయాల్సి వచ్చిందో అనే దానిపై లక్ష్మణ​ వివరణ ఇచ్చాడు. చాంపియన్స్‌ ట్రోఫీని తొలిసారి పాక్‌కు అందించిన సర్పరాజే అత్యుత్తమ వన్డే కెప్టెన్‌ అంటూ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ఈ ఏడాది ప్రధాన వన‍్డే టోర్నీల్లో కోహ్లి కంటే సర్పరాజ్‌ సక్సెస్‌ రేటు బాగుండటం కూడా అతని ఎంపికకు మరొక కారణంగా లక్ష్మణ్‌ స‍్పష్టం చేశాడు.

Advertisement
Advertisement