12 ఏళ్ల తర్వాత...

Viswanathan Anand play in Chess Olympiad after 12 years - Sakshi

చెస్‌ ఒలింపియాడ్‌ బరిలో ఆనంద్‌

హరికృష్ణ, హంపి,హారికలకు చోటు

చెన్నై: సుదీర్ఘ విరామం అనంతరం భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొననున్నాడు. అతడు 2006 లో చివరిసారిగా ఈ మెగా టోర్నీలో ఆడాడు. ఈసారి తాను ఒలింపియాడ్‌లో ఆడేందుకు సిద్ధం గా ఉన్నట్లు సూచించడంతో అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఆనంద్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జార్జియాలో జరిగే ప్రపంచ చెస్‌ ఒలింపియాడ్‌ కోసం ఏఐసీఎఫ్‌ బుధవారం ఐదుగురు చొప్పున సభ్యులున్న పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. పురుషుల జట్టుకు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ ప్రస్తుత 14వ ర్యాంకర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సార థ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, బి.అధిబన్, శశికిరణ్‌ ఉన్నారు. భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఇషా కరవాడే, తానియా సచ్‌దేవ్, పద్మిని రౌత్‌ ఉన్నారు.

ఈ మెగా టోర్నీకి రామ్‌కో గ్రూప్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఏఐసీఎఫ్‌ కార్యదర్శి భరత్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి. పురుషుల్లో 2,650 రేటింగ్‌ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్న వారికి రూ. 2 లక్షలు, 2,600 రేటింగ్‌ పాయింట్ల కంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 1.50 లక్షలు... మహిళల్లో 2,400 రేటింగ్‌ పాయింట్లు దాటిన వారికి రూ. 1 లక్ష, 2,000 రేటింగ్‌ పాయింట్లు దాటిన వారికి రూ. 80 వేలు లభించనున్నాయి. ఇవికాక టోర్నీలో జట్టు స్వర్ణం నెగ్గితే రూ. 3 లక్షలు, రజతం నెగ్గితే రూ. 1.50 లక్షలు, కాంస్యం నెగ్గితే రూ. 75 వేలు ఏఐసీఎఫ్‌ తరఫున ఇవ్వనున్నారు. ఈ టోర్నీకి ముందు క్రీడాకారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు చౌహాన్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top