ఆ బంతి అత్యద్భుతం : కోహ్లి

Virat Kohli Says The Ball to Dismiss Babar Was An Outstanding Delivery - Sakshi

మాంచెస్టర్‌ : పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజంను కుల్దీప్‌యాదవ్‌ ఔట్‌ చేసిన బంతి అత్యుద్భుతమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బాబర్‌, ఫకార్‌ మ్యాచ్‌ తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారని, కానీ కుల్దీప్‌ ఈ జోడిని అద్భుతంగా విడగొట్టాడని కితాబిచ్చాడు. రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ కూడా అత్యద్భుతమని కొనియాడాడు. ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఇన్నింగ్స్‌ సగం పూర్తయ్యాక బంతి స్పిన్‌ తిరగడం మొదలైంది. టాస్‌ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. రోహిత్‌ మరోసారి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌ ఉత్తమ వన్డే ఆటగాడినని చాటాడు. బాబర్‌ ఆజమ్‌ను ఔట్‌ చేసిన కుల్దీప్‌ బంతి అద్భుతం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మనల్ని ఓడించారని... ఈ మ్యాచ్‌ను అతి భావోద్వేగంతో తీసుకుంటే చేదు ఫలితం రావొచ్చు. అందుకని ఆ ఓటమి గురించి ఆలోచించలేదు. ఆటలో ఇలాంటివి భాగమని భావించి ముందుకెళ్లాం. దానికి తగ్గ ఫలితమే ఇది. తొడకండరాలు పట్టేయడంతో భువనేశ్వర్‌ రెండు, లేదా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కానీ కీలక సమయంలో అందుబాటులోకి వస్తాడు’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. 

క్రెడిట్‌ భారత బ్యాట్స్‌మెన్‌దే..
టాస్‌ గెలిచి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ అంతా భారత బ్యాట్స్‌మెన్‌దేనని చెప్పుకొచ్చాడు. ‘ టాస్‌ గెలిచాం. కానీ సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాం. రోహిత్‌ అద్భుతంగా ఆడాడు. రోహిత్‌కు బాల్‌ అప్‌ ప్రణాళిక రచించామని కానీ అది అంతగా పనిచేయలేదు. టాస్‌ గెలిచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారత్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సమిష్టిగా రాణించింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయాం. ఇదే మా కొంప ముంచింది. ఫకార్‌, ఇమామ్‌ అద్భుతంగా ఆడారు. కానీ దాన్ని అందుపుచ్చుకోలేకపోయాం. ప్రస్తుత పరిస్థితులు మాకు కఠినమే. మేం మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలి’ అని తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top